ఆహార భద్రతపై నటి కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు

Kajal Aggarwal sensational comments on food safety
  • ఆహార భద్రతపై స్పందించిన నటి కాజల్ అగర్వాల్
  • దేశంలో ఫుడ్ సేఫ్టీ ఓ సమాంతర వాస్తవికతలా ఉందని వ్యాఖ్య
  • ఈ విషయం తెలిశాక ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపానన్న కాజల్
  • గౌర్మెట్ స్టోర్స్‌లో కొనేటప్పుడు కూడా జాగ్రత్త అవసరమని సూచన
  • ఈ అంశంపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వెల్లడి
ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దేశంలోని ఆహార భద్రత, నాణ్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మనమంతా మనకు తెలియకుండానే ఒక సమాంతర భ్రమల్లో బతుకుతున్నామని, దేశంలో ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన వాస్తవాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆమె తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ప్రమోషన్స్ సందర్భంగా ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కాజల్ ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సినిమా కథ, దానికి సంబంధించిన పరిశోధనా పత్రాలు తన వద్దకు వచ్చినప్పుడు దేశంలోని నిజా నిజాలు చూసి తాను షాక్‌కు గురయ్యానని కాజల్ చెప్పారు. "మన చుట్టూ ఉన్న వాస్తవాలను పట్టించుకోకుండా, మనకు నచ్చిన చిన్న ప్రపంచంలో (బబుల్‌లో) మనం ఎంతో సౌకర్యవంతంగా బతికేస్తున్నాం. కానీ, నిజానికి ఇది ముమ్మాటికీ కపటత్వమే అవుతుంది. ఈ భయంకరమైన నిజాన్ని సమాజానికి చూపించాల్సిన, దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావించాను. ప్రజల్లో అవగాహన కల్పించడమే ఇందులో మొదటి అడుగు. ఏదైనా ఒక సమస్య గురించి తెలిసినప్పుడే కదా, దానిని పరిష్కరించడానికి మనం ముందడుగు వేస్తాం. ఈ కథ నా కళ్లు తెరిపించింది. అయితే, సమాజంలోని ఈ చేదు నిజం నన్ను తీవ్రంగా కలచివేసింది" అని కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు.

నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు
ఈ సినిమా పరిశోధనల్లో తెలిసిన విషయాల వల్ల తాను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపానని కాజల్ అగర్వాల్ వెల్లడించారు. "నేను షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లాక కూడా ఈ సినిమా కథ గురించే ఆలోచించేదాన్ని. నా భర్తతో దీనిపై సుదీర్ఘంగా చర్చించాను. మనం ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని, నిత్యావసర సరుకులు, కూరగాయలను ఒక నమ్మకమైన నిర్దిష్ట ప్రాంతం నుండే కొనాలని ఆయనకు చెప్పాను. ఈ సినిమా కేవలం ఒక నటిగానే కాకుండా, నా కుటుంబం పట్ల బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా నాలో అంతర్గతంగా ఎంతో మార్పు తెచ్చింది. ఒక తల్లిగా, నా తల్లిదండ్రుల క్షేమాన్ని కోరుకునే కూతురిగా నా వారికి అత్యంత సురక్షితమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయించుకున్నాను. చివరకు నా స్నేహితులకు ఫోన్ చేసి అలర్ట్ చేశాను. పెద్ద పెద్ద గౌర్మెట్  లగ్జరీ స్టోర్స్‌ను కూడా మనం గుడ్డిగా నమ్మలేమని, ప్యాకెట్ల వెనుక ఉండే ఫుడ్ సేఫ్టీ స్టాంప్స్ , సర్టిఫికేషన్లను కచ్చితంగా తనిఖీ చేయాలని వారికి సూచించాను" అని కాజల్ పేర్కొన్నారు.

24న సినిమా విడుదల
సామాజిక స్పృహతో కూడిన అంశంతో తెరకెక్కిన ‘ది ఇండియా స్టోరీ’ చిత్రానికి స్వాతి వినాయక్ సైందానే, అనితా జాదవ్, వినాయక్ సైందానే, కల్పేష్ షా, దేవయాని ఖోరతే, ప్రేమ్ జోషిలు నిర్మాతలుగా వ్యవహరించారు. దేశంలో ఆహార రంగంలోని లోపాలను, కల్తీ మాఫియా గుట్టును రట్టు చేసేలా రూపొందిన ఈ చిత్రం జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.  
Kajal Aggarwal
India Story movie
Food safety India
Food adulteration awareness
Kajal Aggarwal interview
India food quality

More Telugu News