శతాబ్దాల కంపెనీ సంచలనం.. స్టాక్ మార్కెట్లోకి పార్లే-జీ.. రూ.లక్ష కోట్ల విలువతో భారీ ఐపీఓ!

Century old company sensation Parle G into stock market huge IPO with 1 lakh crore valuation
  • భారీ ఐపీఓకు సిద్ధమవుతున్న పార్లే ప్రొడక్ట్స్
  • రూ.లక్ష కోట్లకు పైగా వ్యాల్యుయేషన్‌తో మార్కెట్లోకి
  • రూ.9,500 కోట్లకు పైగా నిధులు సమీకరించే యోచన
  • దాదాపు వందేళ్ల తర్వాత పబ్లిక్‌గా మారనున్న కంపెనీ
భారతీయులందరికీ సుపరిచితమైన పార్లే-జీ బిస్కెట్ల తయారీ సంస్థ, పార్లే ప్రొడక్ట్స్ లిమిటెడ్ త్వరలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది భారీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) తీసుకురావాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా 1 బిలియన్ డాల‌ర్ల (దాదాపు రూ.9,530 కోట్లు) నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓ సమయంలో కంపెనీ వ్యాల్యుయేషన్‌ను 10.5 బిలియన్ డాల‌ర్లకు (సుమారు రూ.1 లక్ష కోట్లకు పైగా) పైగా అంచనా వేస్తున్నారు.

దాదాపు వందేళ్లుగా ప్రైవేట్ సంస్థగా కొనసాగుతున్న పార్లే ప్రొడక్ట్స్ పబ్లిక్ ఇష్యూకు రానుండటం భారత కార్పొరేట్ రంగంలో ఒక ముఖ్యమైన పరిణామం. ఈ ఐపీఓ ప్రక్రియను నిర్వహించేందుకు కంపెనీ ఇప్పటికే కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్‌లను సలహాదారులుగా నియమించుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో మరో బ్యాంకును కూడా చేర్చుకునే అవకాశాలున్నాయి. అయితే, ఈ ప్రణాళికలన్నీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, మార్కెట్ పరిస్థితులను బట్టి తుది నిర్ణయాలు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

1929లో ముంబైలోని విలే పార్లేలో ప్రారంభమైన ఈ సంస్థను చౌహాన్ కుటుంబం ప్రమోట్ చేస్తోంది. పార్లే-జీ, క్రాక్‌జాక్, మొనాకో, హైడ్ అండ్ సీక్ వంటి ఐకానిక్ బిస్కెట్లతో పాటు మ్యాంగో బైట్, మెలోడీ, పాపిన్స్ వంటి మిఠాయిలతో ఈ బ్రాండ్ దేశ ప్రజలకు దగ్గరైంది. అమెరికా, యూకే, కెనడా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలతో పాటు పలు దేశాల్లో పార్లే ఉత్పత్తులకు బలమైన మార్కెట్ ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 8.5% వృద్ధితో రూ.15,568 కోట్లకు చేరింది. అయితే, నికర లాభాలు మాత్రం 39% తగ్గి రూ.979 కోట్లుగా నమోదయ్యాయి.

ఐపీఓ ఊహాగానాలపై స్పందించిన కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మయాంక్ షా, మార్కెట్ స్పెక్యులేషన్‌పై తాము వ్యాఖ్యానించబోమని, ప్రస్తుతం వ్యాపార వృద్ధిపైనే దృష్టి సారిస్తున్నామని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ ఐపీఓ ప్రణాళిక ప్రకారమే జరిగితే, ఇది భారత ఎఫ్‌ఎంసీజీ రంగంలోని అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచిపోతుంది. ఇదిలా ఉండగా, చౌహాన్ కుటుంబంలో చీలిక తర్వాత ఏర్పడిన 'పార్లే ఆగ్రో' (ఫ్రూటీ, యాపీ ఫిజ్ బ్రాండ్లు)కు, ఈ పార్లే ప్రొడక్ట్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని గమనించాలి.
Parle Products
Parle G IPO
Indian Stock Market
FMCG Sector India
Chauhan Family
Initial Public Offering

More Telugu News