బంగారం ప్రియులకు గడ్డుకాలమా, గుడ్ న్యూసా?: రాబోయే 6 నెలల్లో పుత్తడి ధరల భవితవ్యంపై 'డబ్ల్యూజీసీ' సంచలన నివేదిక!

World Gold Council report on gold price future for the next six months
  • ఈ ఏడాది ద్వితీయార్థంలో బంగారం ధరల గమనంపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక
  • జనవరి నాటి రికార్డు గరిష్ఠం నుంచి జూన్ నాటికి 4,002 డాలర్లకు పడిపోయిన ధర 
  • యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల ప్రభావంతో మార్కెట్లలో అస్థిరత
  • ఈ ఏడాది చివరకు ధర సగటున 4,100 డాలర్ల వద్ద స్థిరపడే అవకాశం
  • గ్లోబల్ మార్కెట్లలో ఆసియా పెట్టుబడిదారులదే ఇప్పుడు కీలక పాత్ర
కొన్ని వారాలుగా పసిడి మార్కెట్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్న తరుణంలో.. రాబోయే ఆరు నెలల్లో (2026 ద్వితీయార్థంలో) బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై 'వరల్డ్ గోల్డ్ కౌన్సిల్' (డబ్ల్యూజీసీ) తన మధ్యంతర నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా సహా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల విధానాలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ రాబోయే రోజుల్లో బంగారం ధరలను శాసించనున్నాయని నివేదిక స్పష్టం చేసింది.

రికార్డు గరిష్ఠం నుంచి భారీ పతనం 
2026 ఏడాది మొదటి భాగం బంగారం మార్కెట్‌కు అత్యంత అస్థిరమైన కాలంగా నిలిచింది. జనవరి నెల చివరలో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 5,405 డాలర్ల చారిత్రక రికార్డు స్థాయికి చేరింది. అయితే ఆ తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు మారడం, డాలర్ బలోపేతం కావడం, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో జూన్ చివరి నాటికి ధర 4,002 డాలర్లకు పడిపోయింది. ఇది రికార్డు గరిష్ఠం నుంచి దాదాపు 26 శాతం భారీ పతనం కావడం గమనార్హం.

మార్కెట్‌ను ప్రభావితం చేసిన ముఖ్యాంశాలు
ఆసియా ఇన్వెస్టర్ల హవా: మొదటి భాగంలో అమెరికా-ఇరాన్ మధ్య రేగిన సైనిక ఉద్రిక్తతలు బంగారానికి రక్షణగా నిలిచాయి. నివేదిక ప్రకారం, ఆసియా, అమెరికా ట్రేడింగ్ సమయాల్లోనే బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దీన్ని బట్టి అంతర్జాతీయ పసిడి మార్కెట్‌లో ప్రస్తుతం ఆసియా దేశాల పెట్టుబడిదారులే అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని డబ్ల్యూజీసీ వెల్లడించింది.
వడ్డీ రేట్ల భయం: ఈ ఏడాది అక్టోబర్ లోపు అమెరికా సెంట్రల్ బ్యాంక్ (ఫెడ్) కనీసం ఒక్కసారైనా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనాలు మార్కెట్‌లో ఉన్నాయి. దీనితో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు కూడా కఠినమైన ద్రవ్య విధానాలను అవలంబిస్తున్నాయి. ఈ పరిణామాలు బంగారం ధరలపై ఒత్తిడి తెస్తున్నాయి.

మున్ముందు ధరలు పెరుగుతాయా?
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన నివేదికలో రాబోయే కాలానికి సంబంధించి మూడు భిన్నమైన పరిస్థితులను అంచనా వేసింది.

సాధారణ స్థితి: ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు ఇలాగే కొనసాగితే, బంగారం పెద్దగా పెరగకుండా లేదా తగ్గకుండా ఔన్స్‌కు 4,100 డాలర్ల పరిధిలోనే (±5 శాతం హెచ్చుతగ్గులతో) ఈ ఏడాదిని ముగించవచ్చు.
ధరలు పెరిగే అవకాశం: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరిగినా, లేదా ఆర్థిక వ్యవస్థలు బలహీనపడి వడ్డీ రేట్లు తగ్గినా బంగారం మళ్లీ పుంజుకుంటుంది. అయితే ధర తిరిగి 4,500 డాలర్ల మార్కును దాటాలంటే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక మందగమనం రావాల్సి ఉంటుందని డబ్ల్యూజీసీ విశ్లేషించింది.
ధరలు తగ్గే అవకాశం: ఒకవేళ అమెరికా డాలర్ మరింత బలోపేతమై, వడ్డీ రేట్లు అంచనాల కంటే ఎక్కువగా పెరిగితే బంగారంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ధర 4,000 డాలర్ల కంటే దిగువకు పడిపోతే విక్రయాలు మరింత ఎక్కువయ్యే  అవకాశం ఉంది. కానీ, ధరలు బాగా తగ్గితే సెంట్రల్ బ్యాంకులు, సాధారణ కొనుగోలుదారులు మళ్లీ ఎగబడి కొనుగోలు చేయడం వల్ల ధరలకు మళ్లీ మద్దతు లభిస్తుందని నివేదిక పేర్కొంది.
World Gold Council
Gold Price Forecast
Global Gold Market Trends
US Federal Reserve Interest Rates
Gold Investment Outlook
Spot Gold Price 2026

More Telugu News