ఇరాన్ టాప్ లీడర్లను చంపేందుకు ఇజ్రాయెల్ స్కెచ్.. ముందే పసిగట్టి అలర్ట్ చేసిన అమెరికా!

Israel sketch to kill Iran top leaders and US alert in advance
  • ఇరాన్ ప్రతినిధులపై ఇజ్రాయెల్ హత్య కుట్రలను బహిర్గతం చేసిన 'న్యూయార్క్ టైమ్స్'
  • పశ్చిమాసియా దేశాల ద్వారా ఇరాన్‌ను ముందే అప్రమత్తం చేసిన అమెరికా 
  • ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్‌లే ప్రధాన లక్ష్యాలు
  • శాంతి చర్చలను దెబ్బతీయడమే ఇజ్రాయెల్ వ్యూహమని అమెరికా ఆందోళన
  • ఇజ్రాయెల్ యుద్ధ విమానాల భయంతో ఇరాన్ స్పీకర్ విమానం అత్యవసర ల్యాండింగ్
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న అత్యంత సున్నితమైన శాంతి చర్చలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ఒక భారీ హత్యాకాండకు వ్యూహం రచించిందనే సంచలన నివేదికను ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' బయటపెట్టింది. ఇరాన్ తరఫున చర్చల్లో పాల్గొంటున్న ఇద్దరు అత్యున్నత స్థాయి ప్రతినిధులను హతమార్చడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేసిందని, ఈ విషయాన్ని ముందే పసిగట్టిన అమెరికా.. పశ్చిమాసియా దేశాల ద్వారా ఇరాన్‌ను వెంటనే అప్రమత్తం చేసిందని అమెరికా ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ఈ కథనం వెల్లడించింది.

ఇజ్రాయెల్ హిట్ లిస్ట్‌లో ఉన్న ఆ ఇద్దరు ముఖ్య నేతలు
అబ్బాస్ అరాఘ్చీ (ఇరాన్ విదేశాంగ మంత్రి)
మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ (ఇరాన్ పార్లమెంట్ స్పీకర్)


యుద్ధ విమానాల దాడి నుంచి తప్పించుకున్న స్పీకర్!
ఈ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 12న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఇస్లామాబాద్‌ (పాకిస్థాన్)లో చర్చలు ముగించుకుని తిరిగి ఇరాన్ వస్తుండగా ఒక భయంకర ఘటన జరిగింది. ఇరాన్ స్పీకర్ ప్రయాణిస్తున్న విమానాన్ని అడ్డుకుని కూల్చివేయడానికి రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాక్ సరిహద్దుల గుండా ఇరాన్ వైమానిక పరిధిలోకి ప్రవేశించాయి. ఈ నిఘా సమాచారాన్ని అమెరికా సాయంతో పసిగట్టిన ఇరాన్ రక్షణ వర్గాలు.. గాలిబాఫ్ విమానాన్ని వెంటనే ఈశాన్య ఇరాన్‌లోని 'మషద్' నగరంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయించాయి. ఆ తర్వాత ఆయన అక్కడి నుండి 8 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి సురక్షితంగా టెహ్రాన్ చేరుకున్నారు. గాలిబాఫ్ గతంలో జరిగిన దాడుల శిథిలాల నుంచి కూడా రెండుసార్లు ప్రాణాలతో బయటపడటం గమనార్హం.

యూఎస్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన రఫ్తార్
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్రనేతలు మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చర్చల కోసం ముందుకొచ్చిన అలీ లారిజానీ, కమల్ ఖరాజీలను కూడా ఇజ్రాయెల్ హతమార్చింది. అయితే ఏప్రిల్ నుంచి డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం (జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్ వంటి ప్రతినిధులతో) ఇరాన్‌తో శాంతి చర్చలు ప్రారంభించాక.. ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక రాయబారులైన అరాఘ్చీ, గాలిబాఫ్‌లను కూడా చంపేస్తే చర్చలు పూర్తిగా ఆగిపోయి, మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందని ఇజ్రాయెల్ భావించింది.

ఇరాన్‌లో అధికార మార్పిడి జరగాలని, వారి అణు సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని ఇజ్రాయెల్ పట్టుబడుతుండగా.. అమెరికా మాత్రం హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ, అణు నియంత్రణపై ఒక శాంతి ఒప్పందాన్నికుదుర్చుకోవాలని చూస్తోంది. ఈ భిన్నమైన వ్యూహాల కారణంగానే అమెరికా, ఇజ్రాయెల్‌ను పక్కనపెట్టి ఇరాన్‌కు రహస్యంగా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని చేరవేసి వారి రాయబారులను కాపాడాల్సి వచ్చింది. ఈ ముప్పు పొంచి ఉన్నప్పటికీ, మే నెలలో ఖతార్, జూన్‌లో స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన శాంతి చర్చలలో ఇరాన్ ప్రతినిధులు పాల్గొనడం గమనార్హం.  
Israel
Abbas Araghchi
Mohammad Bagher Ghalibaf
US Iran peace talks
New York Times report
Israel Iran conflict

More Telugu News