బ్రేక్అప్లపై జెన్నిఫర్ లోపేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- అవి వ్యక్తిగత ఎదుగుదలకు అవకాశాలని వ్యాఖ్య
- విడిపోయినప్పుడు పార్టీ చేసుకోవాలని సూచన
- హృదయం ముక్కలైనప్పుడే మనల్ని మనం మార్చుకుంటామని వెల్లడి
న్యూయార్క్ సబ్వేలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో 56 ఏళ్ల లోపెజ్ మాట్లాడుతూ, "బ్రేక్ అప్లు వైఫల్యాలు కావు. నిజానికి మనల్ని మనం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి అవొక లాంచ్‌ప్యాడ్ వంటివి. ఎవరైనా విడిపోయినప్పుడు విచారించకుండా మనం పార్టీ చేసుకోవాలి. 'మీరు విడిపోయారా? కంగ్రాట్స్' అని చెప్పాలి. ఎందుకంటే, అది ఆ ఇద్దరి శ్రేయస్సు కోసం తీసుకున్న సరైన నిర్ణయం కావచ్చు" అని వివరించారు.
తన జీవితంలో ఎదురైన మానసిక సవాళ్ల నుంచే తాను అత్యధికంగా నేర్చుకున్నానని జెన్నీఫర్ లోపెజ్ తెలిపారు. "నా జీవితంలో మానసికంగా, వైయుక్తికంగా నేను ఎదిగింది కేవలం హృదయం ముక్కలైన సందర్భాల్లోనే. అది ప్రేమ వైఫల్యం కావచ్చు లేదా వృత్తిపరమైన నిరాశ కావచ్చు. అటువంటి క్లిష్ట సమయాల్లోనే 'అసలేం జరిగింది? మన ప్రవర్తన ఎలా ఉంది? మున్ముందు ఏం చేస్తే బాగుంటుంది?' అని మన గురించి మనం ఆత్మపరిశీలన చేసుకుంటాం. మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం" అని ఆమె పేర్కొన్నారు.
హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్‌ను 2022లో వివాహం చేసుకున్న జెన్నీఫర్ లోపెజ్, 2025లో ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. ఇది ఆమెకు నాలుగో విడాకులు. ఈ నేపథ్యంలో సంబంధ బాంధవ్యాలపై ఆమె చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.