భార్య లావుగా ఉందని గొంతు నులిమి చంపిన భర్త
- ధార్వాడ్‌లో స్టాఫ్ నర్స్‌ను హత్య చేసిన భర్త
- లావుగా ఉన్నావంటూ నిరంతరం వేధింపులు
- వరకట్నం కోసం వేధింపుల ఆరోపణలు
- పిల్లలు పుట్టరంటూ అవమానించిన భర్త
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రియాంకకు 2024 డిసెంబర్లో బసవరాజ్‌తో వివాహమైంది. పెళ్లైన కొన్ని రోజులకే వేధింపులు మొదలయ్యాయని పోలీసులు తెలిపారు. డబ్బు, బంగారం తీసుకురావాలని భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ప్రియాంక శరీరాకృతిని కూడా భర్త తరచూ అవమానించేవాడని పోలీసులు తెలిపారు. ‘‘నువ్వు చాలా లావుగా ఉన్నావు. నీకు పిల్లలు పుట్టరు’’ అంటూ దూషించేవాడని విచారణలో వెల్లడైంది. ఈ వేధింపులు క్రమంగా పెరిగి సోమవారం రాత్రి హత్యకు దారితీశాయని పోలీసులు భావిస్తున్నారు.
ప్రియాంక కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. భర్త తరచూ శారీరకంగా హింసించేవాడని తెలిపారు. ఆ కారణంగా ఆమెకు రెండుసార్లు గర్భస్రావం జరిగిందని ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.
ఘటనపై నవలగుండ పోలీస్ స్టేషన్లో హత్య, వరకట్న వేధింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భర్త బసవరాజ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.