గూడూరులో దేశంలోనే అతిపెద్ద ఫర్నిచర్ పార్క్ రాబోతోంది: చంద్రబాబు
- 'పీ4' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపు
- ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే తమ సంకల్పమని వెల్లడి
- గూడురు ఫర్నిచర్ పార్క్ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందన్న సీఎం
"ఒకప్పుడు పెట్టుబడిదారులు రాష్ట్రం వదిలి పారిపోయారు. కానీ ఇప్పుడు మనపై ఉన్న నమ్మకంతో ఏపీని వెతుక్కుంటూ వస్తున్నారు" అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో జరిగిన ప్రజావేదిక సభలో పాల్గొన్న ఆయన, కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి రోడ్‌మ్యాప్‌ను ప్రజల ముందుంచారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సాగుతున్న 'పీ4' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... దేశానికే ఆదర్శంగా నిలిచిన డ్వాక్రా సంఘాల తరహాలోనే, రాష్ట్రంలో ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. దేశానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని, పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం టాప్‌లో దూసుకుపోతోందని చెప్పారు. ఇందులో భాగంగానే గూడూరులో దేశంలోనే అతిపెద్ద 'మెగా ఫర్నిచర్ పార్క్' రాబోతోందని, దీని ద్వారా దాదాపు 10 వేల మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు ప్రకటించారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధితో పాటు పేదలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించి, సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ అందిస్తామని హామీ ఇచ్చారు.