విజయవాడ బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Vijayawada bypass road accident three people killed in horrific collision
  • బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
  • రెండు లారీల మధ్య నలిగిపోయి నుజ్జునుజ్జయిన కారు
  • ఓ స్కూటరిస్టుకు కూడా ప్రమాదం
  • ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి, ఒకరి పరిస్థితి విషమం
  • అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
  • ఘటనాస్థలిలో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గన్నవరం సమీపంలోని బి.బి. గూడెం వద్ద కొత్త జాతీయ రహదారి (విజయవాడ వెస్బ్ బైపాస్)పై ఒకేసారి పలు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దురదృష్టకర సంఘటన మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళితే, విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళుతున్న ఓ కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కారు అదుపుతప్పి ముందు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ లారీని బలంగా గుద్దుకుంది. రెండు లారీల మధ్య కారు పూర్తిగా నలిగిపోయి నుజ్జునుజ్జయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తల్లి, బిడ్డ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. కారులో ఉన్న మరో వ్యక్తి ఈ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయి, తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 

అదే సమయంలో, రోడ్డుపై వేగంగా వచ్చిన ఓ స్కూటరిస్ట్ కూడా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అదుపుతప్పిన ఆయిల్ ట్యాంకర్ లారీ... స్కూటరిస్టును ఢీకొట్టింది. దాంతో అతడు అక్కడిక్కడే మరణించాడు. 

సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి, రాకపోకలను పునరుద్ధరించారు. మృతదేహాలను, క్షతగాత్రుడిని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Vijayawada Bypass Road Accident
Gannavaram
Krishna District
Road Accident Deaths
Car Lorry Collision
Andhra Pradesh News

More Telugu News