పంజాబ్ కింగ్స్ ఆట‌గాడు శశాంక్ సింగ్‌పై దాడి కేసు.. త‌న‌పై కుట్ర జరిగిందంటున్న క్రికెటర్

Shashank Singh assault case Punjab Kings cricketer claims conspiracy against him
  • క్రికెటర్ శశాంక్ సింగ్, అతని కుటుంబంపై దాడి కేసు నమోదు
  • వంట మనిషిపై దాడి చేశారని, ఫోన్ లాక్కున్నారని ఆరోపణ
  • అతను వంటవాడు కాదని, ఇంట్లో వీడియోలు తీశాడని శశాంక్ వివరణ
  • తమ కుటుంబాన్ని ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపణ
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభం
తన నివాసంలో పనిచేసే వ్యక్తిపై దాడి చేశారన్న ఆరోపణలపై పంజాబ్ కింగ్స్ ఆట‌గాడు, యువ క్రికెటర్ శశాంక్ సింగ్ స్పందించాడు. ఈ ఆరోపణలను అతడు తీవ్రంగా ఖండించాడు. తనపైనా, తన కుటుంబంపైనా కుట్రపూరితంగా కేసు పెట్టారని, తమ కుటుంబాన్ని ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించాడు. వంటవాడినని చెప్పి పనికి వచ్చిన వ్యక్తి అబద్ధం చెప్పాడని, అతను ఇంట్లో అనుమానాస్పదంగా వీడియోలు తీశాడని వివరణ ఇచ్చాడు.

అసలేం జరిగింది?
విపేంద్ర సింగ్ తోమర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భోపాల్‌లోని రాతిబాద్ పోలీసులు క్రికెటర్ శశాంక్ సింగ్, అతడి తండ్రి శైలేష్ సింగ్ (మధ్యప్రదేశ్ మాజీ స్పెషల్ డీజీపీ), వారి డ్రైవర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనపై దాడి చేసి, దుర్భాషలాడారని, తన మొబైల్ ఫోన్ లాక్కున్నారని తోమర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ వివాదంపై శశాంక్ సింగ్ 'ఐఏఎన్ఎస్‌'తో మాట్లాడుతూ తన వాదన వినిపించాడు. "మొదటగా నేను చెప్పేది ఏంటంటే... అతను అసలు వంటవాడే కాదు. వంటవాడినని చెప్పి పనికి వచ్చాడు. కానీ, వంట చేయమని అడిగితే తనకు రాదని ఒప్పుకున్నాడు" అని శశాంక్ తెలిపాడు. ఇంట్లో అతను అనుమానాస్పదంగా ప్రవర్తించాడని, గదులు, అలంకరణ వస్తువులను ఫొటోలు, వీడియోలు తీస్తుండటంతో తమకు అనుమానం వచ్చిందని చెప్పాడు.

"అపరిచిత వ్యక్తి ఇంట్లో వీడియోలు తీయడం ఎవరికీ నచ్చదు. అందుకే అతని ఫోన్ తీసుకుని, వాటిని డిలీట్ చేయమని మాత్రమే అడిగాం. భవిష్యత్తులో ఇది దొంగతనానికి దారితీయవచ్చనే అనుమానంతోనే అలా చేశాం" అని శశాంక్ వివరించాడు.

దాడి, నిర్బంధం ఆరోపణలు అవాస్తవం
తోమర్‌ను కొట్టడం లేదా నిర్బంధించడం వంటి ఆరోపణలను శశాంక్ సింగ్ పూర్తిగా తోసిపుచ్చాడు. "మూడు రోజులు అతడిని బందీగా ఉంచామన్న ఆరోపణ అత్యంత తీవ్రమైనది. మేం గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాం. అలాంటి పనులు ఎప్పటికీ చేయం. మా ఇంట్లో ఎలాంటి దాడి గానీ, దూషణలు గానీ జరగలేదు. అతను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తన ఫోన్‌ను తనతోనే తీసుకెళ్లాడు" అని స్పష్టం చేశాడు. ఇంట్లో వీడియోలు తీసినందుకు తన తల్లి అతడిని మందలించిందే తప్ప, ఎలాంటి దురుసు ప్రవర్తన జరగలేదని అన్నాడు. తమ కుటుంబాన్ని ఇరికించేందుకే ఎవరో ఈ కుట్ర పన్నుతున్నారని శశాంక్ అనుమానం వ్యక్తం చేశాడు.

పోలీసుల దర్యాప్తు
ఈ కేసుపై అడిషనల్ డీసీపీ అనిల్ శర్మ మాట్లాడుతూ.. "వంట మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి కేసు నమోదు చేశాం. ముగ్గురిపై కేసు ఫైల్ అయింది. ప్రస్తుతం ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోంది" అని తెలిపారు.

ఫిర్యాదు ప్రకారం.. రేవా జిల్లాకు చెందిన విపేంద్ర సింగ్ తోమర్ జూన్ 25న నెలకు రూ.15,000 జీతానికి శశాంక్ సింగ్ ఇంట్లో వంటవాడిగా చేరాడు. పనిలో లోపాలున్నాయని చెప్పి తన ఫోన్‌ను లాక్కున్నారని, జూన్ 28న ఫోన్ తిరిగి అడగ్గా ముగ్గురూ కలిసి తనపై దాడి చేసి, బయటకు గెంటేశారని, తన ఫోన్ నుంచి రూ.1000 బస, భోజన ఖర్చుల కింద బదిలీ చేసుకున్నారని ఆరోపించాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 296(బి), 115(2), 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Shashank Singh
Punjab Kings
Shashank Singh assault case
Bhopal police FIR
Shailesh Singh DGP
IPL cricketer controversy

More Telugu News