టీ20 వరల్డ్ కప్ నుంచి మన మహిళల జట్టు నిష్క్రమించడంపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
- ఆస్ట్రేలియాతో ఓడిపోయిన టీమిండియా మహిళల జట్టు
- సౌతాఫ్రికాతో ఓటమే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడానికి ప్రధాన కారణమన్న గవాస్కర్
- జట్టులో ఫిట్నెస్ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వెల్లడి
భారత మహిళా క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై ఓడిపోవడం పెద్ద ఆశ్చర్యం కలిగించకపోయినా, అసలు మన అమ్మాయిలు సెమీఫైనల్ చేరకుండా టోర్నమెంట్ నుండి దాదాపు నిష్క్రమించడానికి అంతకంటే ముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లే ప్రధాన కారణమని విశ్లేషించాడు. ఆ మ్యాచ్‌లో గెలిచే స్థితిలో ఉండి కూడా, అత్యంత పేలవమైన ఫీల్డింగ్ కారణంగా చేజేతులా మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించేశారని మండిపడ్డాడు.
సౌతాఫ్రికా మ్యాచ్‌లో జరిగిన ఆ తప్పుతో పాటు, భారత మహిళా జట్టులో ఫిట్నెస్ లోపాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. మైదానంలో కొందరు ప్లేయర్లు వేళ్లకు బ్యాండేజీలతో ఆడటం చూస్తుంటే, వారు నూటికి నూరు శాతం ఫిట్నెస్తో లేరనే అనుమానం కలుగుతోందన్నాడు. జట్టును ఒంటిచేత్తో గెలిపించగల మ్యాచ్ విన్నర్లు అయితే గాయాలతో ఉన్నా ఆడించడంలో ఒక అర్థం ఉంటుంది కానీ, మిగతా వారి విషయంలో కూడా అదే పంథా కొనసాగించడం సరైనది కాదన్నాడు. ఒకవేళ గాయపడిన ప్లేయర్లనే నమ్ముకుంటే, బెంచ్ మీద ఉన్న రిజర్వ్ ఆటగాళ్లు అంతకంటే మెరుగ్గా ఆడలేరని మేనేజ్మెంట్ భావిస్తోందా? అనే ప్రశ్నలను గవాస్కర్ లేవనెత్తాడు.
దీనికి తోడు మైదానంలో వ్యూహాత్మక లోపాలు కూడా భారత జట్టు కొంపముంచాయని గవాస్కర్ ఎత్తి చూపాడు. ప్రత్యర్థి బ్యాటర్లు మన స్పిన్నర్లను టార్గెట్ చేస్తూ 'ఎక్స్ట్రా కవర్' దిశగా వరుసగా బౌండరీలు బాదుతున్నా, కెప్టెన్సీ పరంగా ఆ గ్యాప్‌ను కవర్ చేయడానికి ఎలాంటి ఫీల్డింగ్ మార్పులు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. అక్కడ కనీసం ఫీల్డర్‌ను ఉంచి ఉంటే, బ్యాటర్లు రిస్కీ షాట్స్ ఆడి వికెట్లు సమర్పించుకునే అవకాశం ఉండేదని, కానీ ఆ కనీస వ్యూహాన్ని కూడా అమలు చేయలేకపోవడం వల్లే మన మహిళా జట్టుకు ఈ పరాభవం ఎదురైందని గవాస్కర్ స్పష్టం చేశాడు.