భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.. తెలంగాణలో సర్వర్లు డౌన్‌!

Land registrations halted as servers go down in Telangana
  • రెండు రోజులుగా పనిచేయని సర్వర్లు!
  • స్తంభించిన స్లాట్‌ బుకింగ్‌, చలాన్‌, ఈ-కేవైసీ సేవలు
  • కార్యాలయాల వద్ద ప్రజలు పడిగాపులు
  • మూడు నెలల్లో ఇది నాలుగోసారి
  • సర్వర్ల పునరుద్ధరణకు సాంకేతిక బృందం కసరత్తు
తెలంగాణ వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు స్తంభించిపోయాయి. సాంకేతిక లోపాలతో ప్రధాన సర్వర్లు గత రెండు రోజులుగా పనిచేయడంలేదని తెలుస్తోంది. భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సర్వర్లు పనిచేయకపోవడంతో కొత్త స్లాట్‌ బుకింగ్‌లు, చలాన్‌ చెల్లింపులు, ఈ-కేవైసీ వంటి ఆన్‌లైన్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ముందుగానే ముహూర్తాలు చూసుకుని స్లాట్‌లు బుక్‌ చేసుకున్న క్రయ, విక్రయదారులు సాక్షులతో కలిసి కార్యాలయాలకు చేరుకున్నా, గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత మూడు నెలల్లో సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్‌ సేవలు నిలిచిపోవడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ప్రజలు, డాక్యుమెంట్‌ రైటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాంకేతిక లోపం ఎక్కడ తలెత్తిందనే విషయంపై క్షేత్రస్థాయి అధికారులకు కూడా సమాచారం లేదు. వారు ప్రజలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. దీంతో కార్యాలయాల వద్ద గందరగోళం నెలకొంది. సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సమస్యను గుర్తించి సర్వర్లను పునరుద్ధరించేందుకు రాష్ట్ర స్థాయి సాంకేతిక బృందం చర్యలు చేపట్టిందని ఉన్నతాధికారులు తెలిపారు. సేవలు ఎప్పటికి పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తారనే విషయంపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Telangana Registration Department
Telangana Land Registrations
Sub Registrar Office Server Down
Property Registration Issues Telangana
TS Registration Slot Booking
Technical Glitch in Telangana Registrations

More Telugu News