అమెరికాలో ఆకస్మిక వరదలు... ఏపీ యువకుడు గల్లంతు
- అమెరికాలోని కాన్సాస్‌లో వరదల్లో కొట్టుకుపోయిన ఏపీ యువకుడు
- బాపట్ల జిల్లా పరుచూరు వాసి దొప్పలపూడి వెంకటేశ్‌గా గుర్తింపు
- గాలింపు ముమ్మరం చేయాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే ఏలూరి లేఖ
- భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహంలో గల్లంతైనట్లు సమాచారం
- కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన
వివరాల్లోకి వెళ్తే, బాపట్ల జిల్లా పరుచూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు కుమారుడైన వెంకటేశ్, అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఒమాహాలో నివసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కాన్సాస్‌లోని సమ్నర్ కౌంటీ వెల్లింగ్టన్ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా ఎస్. ఆలివర్ రోడ్ సమీపంలో ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహంలో అతడి కారు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి వెంకటేశ్ ఆచూకీ లభించలేదు.
ఈ విషయం తెలియడంతో వెంకటేశ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈ ఘటనపై వెంటనే స్పందించారు. వెంకటేశ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఆయన లేఖలు రాశారు. అమెరికా అధికారులతో సమన్వయం చేసుకొని సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం అమెరికా అధికారులు వెంకటేశ్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అతడి ఆచూకీకి సంబంధించి తదుపరి సమాచారం కోసం కుటుంబ సభ్యులు, అధికారులు ఎదురుచూస్తున్నారు.