డ్యాన్స్ చేసిందని భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి చంపిన భర్త!

Husband kills wife and two children with axe for dancing
  • మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో ఘటన
  • ఓ కార్యక్రమంలో భార్య డ్యాన్స్ చేయడంపై మొదలైన వివాదమే కారణం
  • రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న నిందితుడు
    గృహ హింసే ఈ ఘోరానికి దారితీసిందని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం తానూ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాతా బసైయా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్‌పూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. బలరామ్ కుష్వాహా (35), అతడి భార్య రవితా కుష్వాహా (32) మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పది రోజుల క్రితం గ్రామంలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రవిత డ్యాన్స్ చేసింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోగా, పెద్దలు సర్దిచెప్పి జూన్ 24న తిరిగి అత్తారింటికి పంపించారు. అయినప్పటికీ వారి మధ్య వివాదం సద్దుమణగలేదు.

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి బలరామ్ తన భార్య, ఇద్దరు మైనర్ కుమారులను గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొంత సేపటికే బలరామ్ మృతదేహాన్ని కూడా గుర్తించారు.

చాలాకాలంగా వీరి మధ్య గృహ హింస, అంతర్గత వివాదాలు ఉన్నాయని, అవే ఈ ఘోరానికి దారితీశాయని మొరేనా డీఎస్పీ విజయ్ భదోరియా ప్రాథమికంగా వెల్లడించారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Balram Kushwaha
Morena Triple Murder
Madhya Pradesh Crime News
Domestic Violence Suicide
Axe Murder Case
Kishanpur Village Tragedy

More Telugu News