కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితుల పాత క్రికెట్ మ్యాచ్ వీడియో వైరల్!
- కాబోయే భర్తను లోయలోకి నెట్టి చంపిన సియా గోయల్
- ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడిన వైనం
- నిందితుల మధ్య 238 గంటల ఫోన్ కాల్స్ గుర్తింపు
- కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
ఈ వీడియోలో సియా, చేతన్ ఇద్దరూ భారత జట్టు జెర్సీలు ధరించి, స్టేడియం గ్యాలరీలో పక్కపక్కనే కూర్చుని మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. సియా సోదరుడి ద్వారానే చేతన్‌కు ఆమెతో పరిచయం ఏర్పడిందని పోలీసులు ఇదివరకే గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచి వీరిద్దరూ 2,000 సార్లకు పైగా ఫోన్‌లో మాట్లాడుకున్నారని, సంభాషణల సమయం సుమారు 238 గంటలు ఉందని కాల్ డేటా ద్వారా పోలీసులు నిర్ధారించారు.
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌తో సియా గోయల్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబరులో వీరి వివాహం జరగాల్సి ఉండగా, తన ప్రేమకు కేతన్ అడ్డుగా ఉన్నాడని సియా భావించింది. దీంతో ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను హతమార్చాలని నిర్ణయించుకుంది. పక్కా ప్రణాళికతో లోహగఢ్ కోట వద్దకు తీసుకెళ్లి, అక్కడ 400 అడుగుల లోతైన లోయలోకి కేతన్‌ను తోసేసి హత్య చేశారు.
మొదట దీనిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. పెళ్లి రద్దు చేసుకోవడం కన్నా కేతన్‌ను చంపడమే సులువని భావించి ఈ దారుణానికి పాల్పడినట్లు సియా విచారణలో అంగీకరించింది. ప్రస్తుతం నిందితుల ఫోన్ల నుంచి డిలీట్ చేసిన డేటాను రికవరీ చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు.