రహస్య భాగాల్లో డ్రగ్స్ దాచి రవాణా చేస్తూ పట్టుబడిన మహిళ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రహస్య భాగాల్లో డ్రగ్స్ దాచి రవాణా చేస్తూ పట్టుబడిన మహిళ

Woman caught transporting drugs hidden in private parts in Kerala
  • కేరళలో భారీ డ్రగ్స్ ముఠాను ఛేదించిన పోలీసులు
  • ఇద్దరు మహిళలు సహా మొత్తం ఏడుగురి అరెస్ట్
  • నిందితుల నుంచి 308 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో భారీ ఎత్తున సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు మహిళలు సహా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 308 గ్రాముల నిషేధిత ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో పట్టుబడిన అతిపెద్ద డ్రగ్స్ కేసుల్లో ఇది ఒకటిగా అధికారులు తెలిపారు.

వాణియంపార ప్రాంతంలో యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా వ్యవహారం బయటపడింది. పాలక్కాడ్ నుంచి వస్తున్న స్విఫ్ట్ కారును ఆపి సోదా చేయగా, అందులో ఉన్న ఒక మహిళ తన రహస్య భాగాల్లో రెండు గ్రాముల ఎండీఎంఏను దాచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో కారులోని షిఫాస్ (26), విద్య (28), జిష్ణు (27), శ్రీలక్ష్మి (20)లను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అయిన వారిని విచారించగా, ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు షిఫాస్ ఇంట్లో సోదాలు చేయగా మరో 18 గ్రాముల డ్రగ్స్ లభించాయి. వారిచ్చిన సమాచారంతో చావక్కాడ్ సమీపంలోని ఓ అల్యూమినియం ఫ్యాబ్రికేషన్ వర్క్‌షాప్‌పై దాడి చేసి, అక్కడ ప్యాకెట్లలో దాచిన 288 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో షబీర్ (34), అన్షాద్ (31), సుమేష్ (25)లను కూడా అరెస్ట్ చేశారు.

నిందితుల మొబైల్ ఫోన్ల డేటా ఆధారంగా ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఇతరుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేరళలో సింథటిక్ డ్రగ్స్‌ను అరికట్టేందుకు చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా ఈ విజయం సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Advertisement
Kerala Police
MDMA Seizure
Thrissur Drug Bust
Synthetic Drugs Kerala
Women Drug Peddlers
Vaniampara Police Raid

More Telugu News