పేలుడు, కాల్పులతో దద్దరిల్లిన కరాచీ.. ఆరుగురు ఉగ్రవాదుల హతం
- కరాచీలోని సింధ్ రేంజర్ల స్థావరంపై భీకర ఉగ్రదాడి
- ఉగ్రదాడిలో నలుగురు సైనికుల మృతి
- పేలుడు పదార్థాల వాహనంతో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు
- దాడికి బాధ్యత వహించిన జమాత్-ఉల్-అహ్రార్ ఉగ్ర సంస్థ
కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్ల ప్రధాన కార్యాలయంపైకి ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో దూసుకొచ్చారు. స్థావరాన్ని ఢీకొట్టి వాహనాన్ని పేల్చివేసిన వెంటనే, మిగిలిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే ఎదురుదాడికి దిగడంతో ఆ ప్రాంతం మొత్తం కాల్పుల మోతతో దద్దరిల్లింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు, కమాండోలను రంగంలోకి దించారు.
ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి) నుంచి విడిపోయిన ‘జమాత్-ఉల్-అహ్రార్’ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. పాకిస్థాన్‌లో భద్రతా బలగాలపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ దాడిపై సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా తీవ్రంగా స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనలో సామాన్య పౌరులెవరూ గాయపడలేదని అధికారులు ప్రాథమికంగా తెలిపారు.