వరల్డ్‌ క్రికెట్‌లో వైభవ్‌ గొప్ప శక్తిగా ఎదుగుతాడు: సంగక్కర

Vaibhav will emerge as a great force in world cricket says Sangakkara
  • ప్రపంచ క్రికెట్‌ను శాసించే సత్తా వైభవ్‌కు ఉందన్న సంగక్కర
  • పేరు, డబ్బు అతణ్ని ప్రభావితం చేయవని వ్యాఖ్య
  • 12 ఏళ్లకే వైభవ్‌ ప్రతిభను గుర్తించామన్న రాజస్థాన్‌ డైరెక్టర్‌
  • అప్పుడే ఆర్చర్‌, సందీప్‌లను ధైర్యంగా ఎదుర్కొన్నాడని వెల్లడి
15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన వైభవ్‌ సూర్యవంశీపై రాజస్థాన్‌ రాయల్స్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ కుమార సంగక్కర ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌లోనూ అతడు గొప్ప శక్తిగా ఎదుగుతాడని ధీమా వ్యక్తం చేశాడు. చిన్న వయసులోనే అతడిలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం, ఆటపై ఉన్న ప్రేమ అసాధారణమని కొనియాడాడు.

‘స్కై స్పోర్ట్స్‌’తో మాట్లాడిన సంగక్కర.. క్రికెట్‌పైనే కాకుండా జీవితంలోని ఇతర విషయాలపైనా వైభవ్‌కు మంచి అవగాహన ఉందని అభిప్రాయపడ్డాడు. పేరు, డబ్బు, గుర్తింపు వంటి అంశాలు అతణ్ని ఏమాత్రం ప్రభావితం చేయవని చెప్పాడు. కుటుంబం, జట్టు నుంచి సరైన మద్దతు లభిస్తే భారత క్రికెట్‌, ప్రపంచ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ అతడు అగ్రస్థానానికి చేరుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.

2023లో తమ అనలిస్ట్‌ అక్షయ్‌.. 12 ఏళ్ల వైభవ్‌ గురించి మెసేజ్‌ పంపాడని సంగక్కర గుర్తుచేశాడు. మొదట అది సరదాగా అనిపించినా.. అతణ్ని ట్రయల్స్‌కు పిలిపించామని తెలిపాడు. అప్పట్లో రాజస్థాన్‌కు హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి కేవలం ఐదు నిమిషాలు బ్యాటింగ్‌ చూసిన వెంటనే ‘‘ఈ కుర్రాణ్ని తప్పకుండా కొనాలి’’ అని నిర్ణయించుకున్నామని వెల్లడించాడు.

గువాహటిలో జరిగిన శిక్షణ శిబిరంలో జోఫ్రా ఆర్చర్‌, సందీప్‌ శర్మ కొత్త బంతితో బౌలింగ్‌ చేస్తున్న నెట్‌లో ఎవరూ బ్యాటింగ్‌కు ముందుకు రాలేదని సంగక్కర గుర్తు చేసుకున్నాడు. అయితే 14 ఏళ్ల వైభవ్‌ మాత్రం ధైర్యంగా బ్యాట్‌ పట్టుకుని బరిలోకి దిగాడన్నాడు. అతడు బంతిని బాదిన శబ్దం తుపాకీ పేలినట్లుగా వినిపించేదన్నాడు. ఆర్చర్‌, సందీప్‌లను ధైర్యంగా ఎదుర్కొన్నాడని తెలిపాడు. ఓ దశలో ఆర్చర్‌ నవ్వుకుంటూ నిలబడ్డాడని గుర్తు చేసుకున్నాడు.
Vaibhav Suryavanshi
Kumar Sangakkara
Rajasthan Royals
Rahul Dravid
Indian Cricket
Jofra Archer

More Telugu News