విజయ్ సీఎం అయితే రజనీకాంత్ కంగ్రాట్స్ చెప్పలేదని ట్రోల్స్.. విష్ణు విశాల్ ఫైర్
- విజయ్ సీఎం అయితే తనకు అసూయ ఎందుకుంటుందన్న రజనీ
- రజనీలాంటి గొప్ప వ్యక్తి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందంటూ విష్ణు విశాల్ ఫైర్
- మౌనాన్ని వ్యక్తిగత శత్రుత్వంగా మార్చి చూడొద్దని హితవు
దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనకు కంగ్రాట్స్ చెప్పలేదంటూ సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రజనీకాంత్ మీడియా ముందుకు వచ్చి “విజయ్ సీఎం అయితే నాకెందుకు అసూయ ఉంటుంది? నేను ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు” అంటూ అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది. తాజాగా ఈ ఇష్యూపై కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ తీవ్రంగా స్పందించారు.
తన తాజా చిత్రం ‘మట్టి కుస్తీ 2’ ప్రమోషన్స్ వేదికగా విష్ణు విశాల్ స్పందిస్తూ... నాలుగు రోజులు ఎవరైనా సెలబ్రిటీ మౌనంగా ఉంటే చాలు.. సొంతంగా ఊహాగానాలు రాసేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని విషయాల్లో రజనీకాంత్ సైలెంట్‌గా ఉన్నందుకు ఆయనపై నెగెటివిటీ స్ప్రెడ్ చేశారని విమర్శించారు. చివరకు తలైవా మైక్ ముందుకు వచ్చి... తనకు విజయ్‌పై ఎలాంటి కుళ్లు లేదని క్లారిటీ ఇచ్చుకోవాల్సి రావడం చాలా బాధాకరమన్నారు.
భారతీయ సినీ రంగంలో రజనీకాంత్ సాధించిన విజయాలు, ఆయన ఇమేజ్ వేరే లెవెల్ అని విష్ణు చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఇంకొకరిపై అసూయ ఉందనడం సరి కాదని అన్నారు. సినిమా రంగంలో ఉండే మౌనాన్ని వ్యక్తిగత శత్రుత్వంగా మార్చి చూడొద్దని సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు విజ్ఞప్తి చేశారు.