ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై నారా లోకేష్ దృష్టి.. అధికారులకు కీలక ఆదేశాలు
- ప్రభుత్వ పాఠశాలలకు లక్షకు పైగా కొత్త అడ్మిషన్లు
- ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై అధ్యయనానికి ఆదేశం
- సెప్టెంబర్ 5 నుంచి ఏఐ ట్యూటర్ విధానం పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం
- అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన
ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు సుమారు 1,06,000 మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందారని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 7,620 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3,515 పాఠశాలలు (46.13 శాతం) ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని వారు వివరించారు. విద్యా రంగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే ఈ సానుకూల మార్పు చోటుచేసుకుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణ అంశంపై కూడా ప్రధానంగా చర్చించారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. మరోవైపు, సెప్టెంబర్ 5 నుంచి మొదటి విడత కింద 175 'లీప్' పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థుల కోసం 'ఏఐ ట్యూటర్' విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఈ విధానాన్ని 'క్లిక్కర్స్'కు అనుసంధానించాలని మంత్రి అధికారులకు సూచించారు.
అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, విశాఖపట్నంలో డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ, మంగళగిరిలో స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. వచ్చే నెలలో అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.