ఎయిరిండియా పేలుడు వెనుక ఖలిస్థానీలు.. 41 ఏళ్ల తర్వాత నిజం చెప్పిన కెనడా
- 1985 ఘటనపై కెనడా గూఢచారి సంస్థ తొలిసారి స్పష్టమైన వ్యాఖ్యలు
- మోదీ-మార్క్ కార్నీ భేటీ తర్వాత కెనడా చర్యలు వేగం
- ఖలిస్థానీ కార్యకలాపాలపై కఠిన చట్టాలు అమలు చేస్తున్న కెనడా
- దేవాలయాల వద్ద విద్వేష నిరసనలపై నియంత్రణకు బిల్ C-9
- ఐఎస్‌ఐ మద్దతు నెట్‌వర్క్‌లపై ఒత్తిడి పెరిగిందన్న భారత నిఘా వర్గాలు
సీఎస్ఐఎస్ నివేదికలో ఖలిస్థానీ తీవ్రవాదుల పాత్రను ఇంత స్పష్టంగా ప్రస్తావించడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. గతంలో ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమైనప్పటికీ కెనడా భద్రతా సంస్థ ఈ స్థాయిలో బాధ్యతను ఖలిస్థానీ వర్గాలపై మోపలేదు. భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా కెనడా ప్రభుత్వం ఇటీవల కీలక చర్యలు చేపడుతోంది. ఖలిస్థానీల కార్యకలాపాలను అరికట్టేందుకు కొత్త చట్టాలు తీసుకురావడంతో పాటు, విద్వేష ప్రచారంపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
ఇటీవల కెనడా పార్లమెంట్ ఆమోదించిన ‘కంబాటింగ్ హేట్ యాక్ట్’ (బిల్ C-9) కూడా ఖలిస్థానీ వర్గాలకు ఎదురుదెబ్బగా మారనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే దేవాలయాల వద్ద నిరసనలు, విద్వేష ప్రచారం, బెదిరింపుల వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గత కొన్నేళ్లుగా కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు, భారత వ్యతిరేక నినాదాలు, తీవ్రవాదుల చిత్రాలతో ప్రదర్శనలు నిర్వహించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై భారత ప్రభుత్వం పలుసార్లు ఆందోళన వ్యక్తం చేసింది.
భారత్-కెనడా మధ్య భద్రతా సహకారం పెరగడం వల్ల పాకిస్థాన్ ఐఎస్‌ఐ మద్దతు పొందుతున్న ఖలిస్థానీ నెట్‌వర్క్‌లపై ఒత్తిడి పెరుగుతోందని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) వంటి సంస్థల కార్యకలాపాలు ఇటీవల తగ్గాయని చెబుతున్నారు. అయితే ఈ ఒత్తిడి కారణంగా తీవ్రవాద వర్గాలు నిరాశతో కొత్త కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని భారత నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పంజాబ్ లేదా పొరుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దాడులకు యత్నించే ప్రమాదం ఉందని అప్రమత్తం చేశాయి.