అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం
- నిరుద్యోగుల కోసం జూలైలో 'నైపుణ్యం' పోర్టల్ ఆవిష్కరణ
- అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు
- ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు
- ఓంక్యాప్ ద్వారా వచ్చే నెలలో 146 మందికి విదేశీ ఉద్యోగాలు
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును డేటా ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. విశ్వవిద్యాలయాన్ని యూనిట్‌గా తీసుకుని నియామకాలు చేపడుతున్నందున, ఎంపిక కమిటీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ఈ నియామక ప్రక్రియను ముగించాలని ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి పరిశ్రమలతో తప్పనిసరిగా ఒప్పందాలు ఉండాలని, దీని కోసం రూపొందించే చట్టం దేశానికే ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.
నిరుద్యోగ యువత కోసం రూపొందించిన 'నైపుణ్యం' పోర్టల్‌ను వచ్చే నెలలో ఆవిష్కరించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. దీని ద్వారా నమోదైన ప్రతి ఒక్కరికీ ఆన్‌లైన్ స్కిల్ కార్డు జారీ చేస్తామని వెల్లడించారు. పీఎం సేతు పథకం కింద మంజూరైన క్లస్టర్లలో ఐటీఐలను బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఏఐ ల్యాబ్స్‌లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కార్పొరేషన్ (ఓంక్యాప్) ఆధ్వర్యంలో వచ్చే నెలలో 146 మందికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1,30,422 మందికి ఉద్యోగాలు లభించాయని, ఇకపై ప్రతి త్రైమాసికానికి నియోజకవర్గ కేంద్రాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలని లోకేష్ ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్త, స్కిల్ డెవలప్‌మెంట్ ఎండీ గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.