పుణే హత్య కేసులో నిందితురాలి తల్లిదండ్రుల సంచలన వ్యాఖ్యలు!

Siya Goyal parents make sensational comments in Pune murder case
  • కేతన్‌ అగర్వాల్‌ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్‌
  • తప్పు చేసి ఉంటే తన కూతుర్ని శిక్షించాలన్న నిందితురాలి పేరెంట్స్‌
  • తల్లి, తండ్రి ఇద్దరిదీ ఒకే మాట
  • ఈ వ్యవహారంతో తండ్రికి గుండెపోటు
  • పుణేలోని ఓ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
పుణేలో సంచలనం సృష్టించిన లోహగడ్ కోట హత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్‌పై ఆమె తల్లిదండ్రులే సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుమార్తె నిజంగా నేరం చేసి ఉంటే కఠిన శిక్ష విధించాలన్నారు. అవసరమైతే ఉరిశిక్ష కూడా అమలు చేయాలని స్పష్టం చేశారు.

సియా గోయల్ తల్లి మాట్లాడుతూ ‘‘నా కుమార్తె తప్పు చేసి ఉంటే ఆమెకు అత్యంత కఠిన శిక్ష పడాలి. నేరం నిరూపితమైతే ఉరి తీయండి. ఈ మాట ఒక తల్లిగా నేనే చెబుతున్నాను’’ అని వ్యాఖ్యానించారు. సియా తండ్రి ప్రవీణ్ గోయల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈ కేసులో ఎవరు తప్పు చేసినా.. అది నా కుమార్తె అయినా సరే ఉరిశిక్ష విధించాలి’’ అని తేల్చి చెప్పారు.

ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవీణ్ గోయల్ జూన్ 23న గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పుణేలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం.. సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. జూన్ 18న మహారాష్ట్రలోని లోహగడ్ కోటకు ట్రెక్కింగ్ పేరుతో తీసుకెళ్లి అక్కడి లోయలోకి తోసేయడంతో కేతన్ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. మొదట దీన్ని ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా భావించినప్పటికీ సీసీటీవీ ఫుటేజీలు, ఫోన్ కాల్ రికార్డులు, ఇతర ఆధారాల ఆధారంగా పోలీసులు హత్య, కుట్ర కేసులు నమోదు చేశారు.
Siya Goyal
Lohagad Fort murder
Pune crime news
Ketan Agarwal
Chetan Chaudhary
Praveen Goyal

More Telugu News