పిరమిడ్‌ స్కీమ్‌ల ఉచ్చులో పడొద్దు.. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్‌ కామత్‌ హెచ్చరిక

Nithin Kamath warns against falling into pyramid scheme traps
  • 18 ఏళ్ల వయసులో రెండేళ్లు ఎంఎల్‌ఎం కంపెనీలో పనిచేసినట్లు కామత్‌ వెల్లడి
  • తర్వాత అది పిరమిడ్ స్కీమ్ అని తెలిసిందని వ్యాఖ్య
  • భారత్‌లో ఇప్పటికీ రోజుకు రెండు కొత్త పిరమిడ్ స్కీమ్‌లు వస్తున్నాయని ఆందోళన
  • 5.5 కోట్ల మందికి పైగా ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడ్డారని అంచనా
  • త్వరగా ధనవంతులు అయ్యే షార్ట్‌కట్ లేదని సూచన
ఒక్క రాత్రిలో ధనవంతులు కావాలని చాలా మంది కలలు కంటుంటారు. ముఖ్యంగా యువతలో త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అలాంటి ఆశలే కొన్నిసార్లు మోసాల బారిన పడేలా చేస్తాయని జీరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ హెచ్చరించారు. తాను కూడా కెరీర్ ప్రారంభ దశలో ఓ పిరమిడ్ స్కీమ్‌లో చిక్కుకున్నానంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రెండేళ్లు పిరమిడ్ స్కీమ్‌లోనే..
అమెరికన్ వెబ్ సిరీస్ ‘పిరమిడ్ స్కీమ్’ చూసిన తర్వాత తన గత అనుభవాలు గుర్తొచ్చాయని నితిన్ కామత్ సోషల్ మీడియాలో వెల్లడించారు. 18 ఏళ్ల వయసులో ట్రేడింగ్ కోసం డబ్బు సమకూర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ఓ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలో చేరానని చెప్పారు. దాదాపు రెండేళ్ల పాటు అందులో కొనసాగానని, తర్వాత అది పిరమిడ్ స్కీమ్ అని తెలిసిందన్నారు.

తనను ఆ వ్యాపారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి మోసం చేశాడని అనుకోవడం లేదని, అసలు కంపెనీనే వేలాది మందిని తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. తాను కూడా మరికొందరిని అందులోకి తీసుకురావడం ఇప్పటికీ బాధ కలిగిస్తుందని చెప్పారు.

పిరమిడ్ స్కీమ్ అంటే ఏంటి?
పిరమిడ్ స్కీమ్‌లో అసలు ఉత్పత్తి లేదా సేవ కంటే కొత్త సభ్యులను చేర్చడానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎంతమందిని తీసుకొస్తే అంత ఎక్కువ ఆదాయం వస్తుందని చెబుతారు. భారీ లాభాలు, తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు అవుతుందని ఆశ చూపిస్తారు. అయితే చివరికి ఎక్కువ మంది పెట్టుబడిదారులు నష్టపోతారు.

ఇప్పటికీ ఆగని మోసాలు
ఈ తరహా స్కీమ్‌లు గతంలోనే అంతరించిపోయాయని తాను అనుకున్నానని, కానీ ఇప్పటికీ భారత్‌లో రోజుకు రెండు కొత్త పిరమిడ్ స్కీమ్‌లు ప్రారంభమవుతున్నాయన్న విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయానని కామత్ తెలిపారు. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం దేశంలో 5.5 కోట్ల మందికిపైగా ప్రజలు ఇలాంటి పథకాల వల్ల తాము దాచుకున్న డబ్బు కోల్పోయారని చెప్పారు. 2015 నాటికే రూ.10 లక్షల కోట్లకు పైగా నష్టం జరిగిందని, ప్రస్తుతం ఆ సంఖ్య మరింత పెరిగి ఉండొచ్చని పేర్కొన్నారు.

త్వరగా ధనవంతులు అయ్యే మార్గం లేదు
డబ్బు సంపాదించడానికి షార్ట్‌కట్ అంటూ ఏదీ ఉండదని నితిన్ కామత్ స్పష్టం చేశారు. ట్రేడింగ్ అయినా, వ్యాపారం అయినా, పెట్టుబడులు అయినా సమయం, క్రమశిక్షణ, అనుభవం అవసరమని చెప్పారు. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రాబడి వస్తుందని ఎవరైనా హామీ ఇస్తే దాని వెనుక ఉన్న ప్రమాదాన్ని కూడా అర్థం చేసుకోవాలని సూచించారు. రాబడి ఎంత ఎక్కువగా చెబితే, ప్రమాదం కూడా అంత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

స్టాక్ మార్కెట్‌పైనా హెచ్చరిక
షేర్ మార్కెట్లో డబ్బు సంపాదించడం చాలా సులభమనే ప్రచారం కూడా ప్రమాదకరమని కామత్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ద్వారా చాలామంది అవాస్తవ అంచనాలు పెంచుకుంటున్నారని, చివరికి నష్టాలు వచ్చినప్పుడు మౌనంగా మార్కెట్ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని అన్నారు.

అలా అంటే పారిపోండి
ఎవరినైనా స్కీమ్‌లో చేర్చితే డబ్బు వస్తుందని, భారీ ఆదాయం సమకూరుతుందని ఎవరైనా చెబితే వెంటనే దూరంగా ఉండాలని కామత్ హెచ్చరించారు. అలాంటి వాటిలో ఎక్కువ శాతం మోసపూరిత పథకాలేనని స్పష్టం చేశారు.
Look at Shorts
Nithin Kamath
Zerodha
Pyramid Schemes
Multi Level Marketing
Investment Scams
Financial Fraud

More Telugu News