భారత్‌పై తన అభిమానాన్ని చాటుకున్న ఇటలీ ప్రధాని మెలోని
- 'జార్జియాస్ విజన్' పేరుతో పుస్తకం రాసిన మెలోని
- ఢిల్లీ పర్యటన సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా తన పోస్టర్లు చూసి మురిసిపోయానన్న మెలోని
- తన ఫొటోలతో స్వాగతం పలికిన భారత్‌కు థాంక్స్ అని వ్యాఖ్య
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి భారత్‌పై ఉన్న ప్రత్యేక అభిమానం మరోసారి అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని మోదీ ఆమెకు ‘మెలోడీ’ చాక్లెట్లు కానుకగా ఇచ్చిన విజువల్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా... తాజాగా ఆమె రాసిన సరికొత్త పుస్తకం ‘జార్జియాస్ విజన్’లో భారత్ పర్యటన తాలూకు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఢిల్లీ పర్యటనలో తనకు లభించిన గ్రాండ్ వెల్‌కమ్ గురించి రాస్తూ... రోడ్డుకు ఇరువైపులా తన భారీ పోస్టర్లను చూసి మురిసిపోయానని మెలోని పేర్కొన్నారు. ఆ సమయంలో తన పక్కనే ఉన్న ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో తజని.. "ఈ క్రేజ్ చూస్తుంటే మీరు గనుక ఢిల్లీ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం 10 లక్షల మెజారిటీతో గెలుస్తారు" అంటూ సరదాగా చమత్కరించిన విషయాన్ని వెల్లడించారు. 2023లో రైసినా డైలాగ్, జీ20 సదస్సుల కోసం రెండుసార్లు భారత్‌లో పర్యటించిన మెలోని.. "అడుగడుగునా నా ఫొటోలతో స్వాగతం పలికిన భారత్‌కు థాంక్స్" అంటూ మన దేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.