పాస్‌పోర్ట్ ఫీజుల భారీ పెంపు.. జూలై 1 నుంచి కొత్త ధరలు

Passport fees hike significantly new prices from July 1
  • సాధారణ పాస్‌పోర్ట్‌పై రూ.1000 నుంచి రూ.1500 వరకు పెంపు
  • తత్కాల్, మైనర్ల పాస్‌పోర్ట్ రుసుముల్లో కూడా గణనీయమైన మార్పులు
  • నిర్వహణ ఖర్చులు పెరగడమే కారణమన్న విదేశాంగ శాఖ
పాస్‌పోర్ట్ జారీకి సంబంధించిన రుసుములను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. సవరించిన ధరలు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) వెల్లడించింది. ఈ మేరకు జూన్ 20న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాస్‌పోర్ట్ సేవల నిర్వహణ ఖర్చులు పెరగడంతో సుదీర్ఘ విరామం తర్వాత ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తాజా సవరణల ప్రకారం, సాధారణ కేటగిరీలో 36 పేజీల అడల్ట్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కి (67 శాతం పెంపు) పెరిగింది. అదేవిధంగా, 60 పేజీల పాస్‌పోర్ట్ రుసుము రూ.2,000 నుంచి రూ.3,500కి (75 శాతం పెంపు) చేరింది. తత్కాల్ స్కీమ్ కింద 36 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.5,000, 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 18 ఏళ్లలోపు మైనర్లకు 36 పేజీల పాస్‌పోర్ట్ ఫీజును రూ.1,750గా నిర్ణయించారు.

పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా లేదా పాడైపోయినా తిరిగి పొందేందుకు అయ్యే రీప్లేస్‌మెంట్ ఖర్చులను కూడా గణనీయంగా పెంచారు. సాధారణ విధానంలో 36 పేజీల పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్‌కు రూ.5,000, 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.6,000 చెల్లించాలి. వీటినే తత్కాల్ విధానంలో పొందాలంటే వరుసగా రూ.7,500, రూ.8,500 ఖర్చవుతుంది. కాగా, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) ఫీజును రూ.750గా ఖరారు చేశారు.

ప్రస్తుతం పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో పాత రుసుములే కనిపిస్తున్నప్పటికీ, జూలై 1 నుంచి కొత్త ధరలు వర్తిస్తాయి. అయితే పాస్‌పోర్ట్ కాలపరిమితిలో ఎలాంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేశారు. పెద్దలకు 10 ఏళ్లు, మైనర్లకు 5 ఏళ్ల పాటు పాస్‌పోర్ట్ చెల్లుబాటు కానుంది.
Passport Fees
Ministry of External Affairs
Indian Passport Price Hike
Tatkal Passport Charges
Passport Seva Portal

More Telugu News