థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు తగ్గాలి: రామ్ చరణ్
- రిపబ్లిక్ టీవీ సమ్మిట్ లో పాల్గొన్న రామ్ చరణ్
- మల్టీప్లెక్స్‌లలో తినుబండారాల రేట్ల పట్ల అభిమానులు అసంతృప్తితో ఉన్నారన్న చరణ్
- అధిక ధరల వల్ల చాలా మంది థియేటర్లకు రావడానికి వెనుకంజ వేస్తున్నారని వ్యాఖ్య
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ దగ్గర జోరు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ మొదటిసారి ఒక నేషనల్ స్టేజ్‌పై కనిపించి సందడి చేశారు. న్యూఢిల్లీలో రిపబ్లిక్ టీవీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘సమ్మిట్ 2026’లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
‘గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్’ అనే థీమ్‌తో జరిగిన ఈ సమ్మిట్‌లో అర్ణబ్ గోస్వామితో సాగిన స్పెషల్ సెషన్‌లో... చరణ్ కేవలం సినిమా గురించే కాకుండా సాధారణ ఆడియన్స్ ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్యపై మాట్లాడారు.
థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎదురవుతున్న ఇబ్బందులపై రామ్ చరణ్ స్పందించారు. "భారతదేశంలో ఇప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు అత్యంత చౌకైన వినోదం సినిమా మాత్రమే. కానీ ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఫుడ్ అండ్ బేవరేజెస్ ధరలే. మల్టీప్లెక్స్‌లలో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అధిక ధరల భారం వల్ల చాలా మంది థియేటర్లకు రావడానికే వెనుకంజ వేస్తున్నారు. ఈ రేట్లు కొంత తగ్గితే ఆడియన్స్‌కు సినిమా ఎక్స్‌పీరియన్స్ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది" అని చరణ్ పేర్కొన్నారు.