21 వేల మంది ఉద్యోగుల్ని తొలగించాం.. భవిష్యత్తులో తొలగింపులు ఇంకా ఉంటాయి: ఒరాకిల్‌

  • ఒరాకిల్‌ ఉద్యోగుల సంఖ్యలో 13% తగ్గుదల
  • భవిష్యత్తులోనూ ఉద్యోగ కోతలు కొనసాగొచ్చని హెచ్చరిక
  • ఏఐ డేటా సెంటర్లపై భారీ పెట్టుబడులు
  • 70 బిలియన్‌ డాలర్ల మూలధన వ్యయానికి ప్రణాళిక
  • పునర్వ్యవస్థీకరణ కోసం 1.84 బిలియన్‌ డాలర్ల ఖర్చు
కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలపై ప్రభావం మరింత స్పష్టమవుతోంది. అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్‌ 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 21 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు వెల్లడించింది. ఏఐ ఆధారిత కార్యకలాపాల విస్తరణ, వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తన వార్షిక నివేదికలో పేర్కొంది.

గత ఏడాది 1.62 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. 2026 మే 31 నాటికి ఆ సంఖ్య 1.41 లక్షలకు తగ్గింది. సంస్థ ఉద్యోగుల సంఖ్యలో ఇది దాదాపు 13 శాతం తగ్గుదల. ఏఐ టెక్నాలజీల వినియోగం ఇప్పటికే ఉద్యోగ కోతలకు దారితీసిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కోతలు కొనసాగొచ్చని ఒరాకిల్‌ స్పష్టం చేసింది.

ఒరాకిల్‌ ప్రస్తుతం డేటాబేస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థగానే కాకుండా, ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగాల్లో కీలక సంస్థగా ఎదగడానికి భారీ పెట్టుబడులు పెడుతోంది. ఓపెన్‌ఏఐ వంటి సంస్థల అవసరాల కోసం భారీ డేటా సెంటర్ల నిర్మాణంలో నిమగ్నమైంది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 70 బిలియన్‌ డాలర్ల మూలధన వ్యయం చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రణాళికలకు నిధులు సమకూర్చేందుకు మరో 40 బిలియన్‌ డాలర్లు రుణాలు, ఈక్విటీ రూపంలో సమీకరించాలని సంస్థ భావిస్తోంది. అయితే ఈ భారీ ఏఐ పెట్టుబడులు సంస్థపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి. పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగుల తొలగింపుల కోసం 2026 ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్‌ 1.84 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. గతేడాది ఈ వ్యయం కేవలం 374 మిలియన్‌ డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం.

Oracle
Oracle layoffs 2024
AI job cuts
Oracle restructuring
Tech industry layoffs
Cloud computing investments

More Telugu News