ఐఐటీ బాంబేలో షాకింగ్ ఘ‌ట‌న‌.. సీసీటీవీలో రికార్డ‌యిన దృశ్యాలు.. భయాందోళనలో విద్యార్థులు

IIT Bombay shocking incident CCTV footage recorded students in fear
  • ముంబై ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి సంచారం కలకలం 
  • స్టాఫ్ హాస్టల్ వద్ద వీధికుక్కపై దాడి చేసి చంపేసిన వైనం
  • సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయిన ఈ ఘటన మొత్తం 
  • తీవ్ర భయాందోళనలో విద్యార్థులు, సిబ్బంది 
  • రాత్రిపూట బయటకు రావాలంటే జనం భయపడుతున్న వైనం
దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే క్యాంపస్‌లో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. పవాయ్‌లోని క్యాంపస్ స్టాఫ్ హాస్టల్ ప్రాంతంలో ఓ వీధికుక్కపై చిరుత దాడి చేసి చంపేసింది. నిన్న‌ తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో బయటకు రావడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.

సీసీటీవీ ఫుటేజీలో రికార్డ‌యిన దృశ్యాలలో.. హాస్టల్ మెట్ల వద్ద ఓ వీధికుక్క నిలబడి ఉంది. ప్రమాదాన్ని ముందే పసిగట్టినట్టుగా అది పదేపదే ఓ వైపు చూస్తూ అప్రమత్తంగా కనిపించింది. ఇంతలోనే ఓ చిరుతపులి నెమ్మదిగా అక్కడికి వచ్చి దానిపై మెరుపుదాడి చేసింది. కుక్క ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ, చిరుత దాని మెడను నోట కరచుకుని చంపేసింది. అనంతరం కుక్క కళేబరాన్ని చీకట్లోకి లాక్కెళ్లిపోయింది.

ఈ షాకింగ్ ఘటనతో క్యాంపస్‌లోని విద్యార్థులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట బయటకు రావాలంటే భయంగా ఉందని, తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. పెంపుడు జంతువుల విషయంలో కూడా వారు ఆందోళన పడుతున్నారు.

ఐఐటీ బాంబే క్యాంపస్ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో గతంలోనూ చిరుతపులుల జాడ కనిపించింది. అయితే, నివాస ప్రాంతాలకు ఇంత దగ్గరగా వచ్చి దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని స్థానికులు చెబుతున్నారు.
Go Back to Shorts
IIT Bombay
Leopard attack
Mumbai news
Powai
CCTV footage
Student safety

More Telugu News