భారత్‌లో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు... ధర ప్రకటించిన మారుతి

  • భారత్‌లో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుగా వ్యాగన్ఆర్ బయోఫ్లెక్స్
  • ప్రారంభ ధర రూ.7.24 లక్షలుగా ప్రకటించిన మారుతీ సుజుకి
  • ప్రస్తుతానికి కమర్షియల్ విభాగంలో మాత్రమే లభ్యం
  • E20 నుంచి E100 ఇథనాల్ మిశ్రమంతో నడిచే ప్రత్యేక ఇంజిన్
  • పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే రూ.86,000 అదనపు ధర
దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వాడకాన్ని ప్రోత్సహించే దిశగా మారుతి సుజుకి కీలక అడుగు వేసింది. భారత్‌లో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ కారుగా నిలిచిన ‘వ్యాగన్ఆర్ బయోఫ్లెక్స్’ ధరను అధికారికంగా ప్రకటించింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.7.24 లక్షలుగా నిర్ణయించారు. అయితే, ఈ కారు ప్రస్తుతానికి కేవలం కమర్షియల్ అవసరాల కోసం మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాగన్ఆర్ టాప్-స్పెక్ ZXi+ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ఆధారంగా ఈ బయోఫ్లెక్స్ మోడల్‌ను రూపొందించారు. సాధారణ పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే, ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ధర రూ.86,000 ఎక్కువగా ఉంది. ఇందులో 1.2-లీటర్ K12N ఫోర్-సిలిండర్ ఇంజిన్‌ను ఫ్లెక్స్-ఫ్యూయల్‌కు అనుకూలంగా మార్పులు చేశారు.

ఈ కారు E20 (20% ఇథనాల్) నుంచి E100 (100% ఇథనాల్) వరకు ఎలాంటి ఇథనాల్ మిశ్రమాంతోనైనా నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనికోసం ఇంజిన్‌లో ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఫ్యూయల్ పంప్, ఫ్యూయల్ లైన్స్‌ను అప్‌గ్రేడ్ చేశారు. అలాగే, ప్రత్యేకంగా ఇథనాల్ సెన్సార్‌ను అమర్చడంతో పాటు ECUను కూడా రీక్యాలిబరేట్ చేశారు.

పెట్రోల్, డీజిల్ దిగుమతులను తగ్గించి, పర్యావరణ అనుకూల ఇంధనాలను ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ కారును విడుదల చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా E100 సామర్థ్యం గల వాహనాల వైపు మొగ్గు చూపాలని సూచిస్తున్న విషయం తెలిసిందే. కాగా, రెగ్యులర్ వ్యాగనార్‌లలో లభించే డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లు ఈ బయోఫ్లెక్స్ వేరియంట్‌లో అందుబాటులో లేవని మారుతి తెలిపింది.

Maruti Suzuki
WagonR Bioflex
Flex Fuel Car India
Maruti WagonR Price
Ethanol Powered Vehicle
Nitin Gadkari

More Telugu News