విజయ్-సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా
- సీఎం విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా
- విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, తీవ్రంగా వేధించారని సంగీత ఆరోపణ
- తనను, పిల్లలను అవమానాలకు గురిచేశారని విడాకుల పిటిషన్‌లో పేర్కొన్న సంగీత
- ఇటీవల జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్
తన పిటిషన్‌లో సంగీత పలు సంచలన ఆరోపణలు చేశారు. 2021లోనే విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని తాను గుర్తించానని, దీనిపై నిలదీసినప్పుడు ఆ బంధాన్ని తెంచుకుంటానని విజయ్ పలుమార్లు హామీ ఇచ్చారని తెలిపారు. అయినప్పటికీ, విజయ్ ఆ సంబంధాన్ని కొనసాగించడమే కాకుండా సదరు నటితో కలిసి విహారయాత్రలకు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారని ఆరోపించారు. వారిద్దరూ బహిరంగ ప్రదేశాల్లో కలిసి ఉన్న ఫొటోలను ఆ నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా తనను, తన ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషాను తీవ్ర అవమానానికి గురిచేశారని సంగీత ఆవేదన వ్యక్తం చేశారు.
విజయ్ తనపై ఆర్థిక ఆంక్షలు విధించారని, గతంలో ఉన్న సౌకర్యాలను ఉపసంహరించుకుని, తన స్వేచ్ఛను కూడా నియంత్రించారని సంగీత ఆరోపించారు. ఈ పరిణామాల వల్ల తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని, ప్రత్యేక వివాహాల చట్టంలోని సెక్షన్ 27(1)(a), 27(1)(d) కింద తనకు విడాకులు మంజూరు చేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్న విజయ్, సంగీత... తమ 26 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఈ కేసు విచారణ ఏప్రిల్ 20నే జరగాల్సి ఉండగా, వారిద్దరూ హాజరుకాకపోవడంతో జూన్ 15న తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఈ గందరగోళం నడుస్తుండగా, మరోవైపు విజయ్ రాజకీయ ప్రస్థానం ఉన్నత శిఖరాలకు చేరింది. ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించింది. దాదాపు 60 ఏళ్లుగా తమిళనాడును పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను ఓడించి, మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.