భారత క్రికెట్ జట్టు వెటరన్ ఓపెనర్, 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ తన సుదీర్ఘ కెరీర్‌లో మరో అరుదైన చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో నేడు ధర్మశాలలో జ‌రిగే తొలి వన్డేలో బరిలోకి దిగడం ద్వారా, వన్డే క్రికెట్‌లో ఆడిన అత్యంత పెద్ద వయసు భారత ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించ‌నున్నాడు. ఈ మైలురాయితో 37 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న మాజీ ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్‌నాథ్ రికార్డును రోహిత్ అధిగమిస్తాడు.

1989లో తన చివరి వన్డే ఆడినప్పుడు మొహిందర్ అమర్‌నాథ్ వయసు 39 ఏళ్ల 36 రోజులు. కాగా, నేటి మ్యాచ్‌లో బ‌రిలోకి దిగే రోహిత్ శర్మ 39 ఏళ్ల 44 రోజుల వయసుతో ఆ రికార్డును తన పేరిట లిఖించ‌నున్నాడు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జ‌రిగే ఈ మ్యాచ్, 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా నిర్వహిస్తున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగం.

విరాట్ కోహ్లీ గాయం కారణంగా దూరమవడంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టుకు రోహిత్ అనుభవం అదనపు బలాన్నిస్తోంది. ఐపీఎల్‌లో ఎదురైన స్వల్ప గాయం నుంచి పూర్తిగా కోలుకుని, ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గిన రోహిత్ ఎప్ప‌టిలాగే ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగ‌నున్నాడు.

తన కెరీర్‌లో 11,000కు పైగా వన్డే పరుగులు, అంతర్జాతీయంగా 20,000కు పైగా పరుగులు సాధించిన రోహిత్, ఈ వయసులోనూ తన ఫిట్‌నెస్, ఫామ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఆధునిక క్రికెట్‌లో మెరుగైన ఫిట్‌నెస్ ప్రమాణాల వల్లే ఆటగాళ్లు తమ కెరీర్‌ను ఎలా పొడిగించుకోగలరో రోహిత్ ఘనత నిరూపిస్తోంది.