చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) వైద్య శాస్త్ర రంగంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. కణ స్థాయిలో మానవ బ్రెయిన్‌స్టెమ్ కు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత స్పష్టమైన 3డీ అట్లాస్‌ను ఆవిష్కరించింది. 'యాంకర్'గా నామకరణం చేసిన ఈ అట్లాస్, మెదడు సంబంధిత పరిశోధనలు, చికిత్సల కోసం అపూర్వమైన వనరుగా నిలవనుంది.

మానవ శరీరంలో శ్వాస, హృదయ స్పందన, నిద్ర వంటి కీలక విధులను నియంత్రించే మెదడులోని ప్రధాన భాగాన్ని 'బ్రెయిన్‌స్టెమ్' అంటారు. ఈ ప్రాంతంలో తలెత్తే స్వల్ప సమస్యలైనా తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. ఐఐటీ మద్రాస్‌లోని సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ 'యాంకర్' అట్లాస్... పిండం దశ నుంచి బాల్యం, వయోజన దశల వరకు మెదడులో చోటుచేసుకునే మార్పులను వివరిస్తుంది. ఇందులో 200కు పైగా బ్రెయిన్‌స్టెమ్ న్యూక్లియై, ఫైబర్ ట్రాక్టులను అత్యంత స్పష్టంగా 3డీ రూపంలో పొందుపరిచారు.

జూన్ 5 నుంచి 7 వరకు ఐఐటీ మద్రాస్ ప్రాంగణంలో జరిగిన 3వ బ్రిక్స్ న్యూరోసైన్స్ సింపోజియంలో ఈ అట్లాస్‌ను అధికారికంగా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, వైద్య నిపుణుల సౌకర్యార్థం దీనిని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ రూపంలో ఉచితంగా అందుబాటులో ఉంచారు.

ఈ ఆవిష్కరణ న్యూరోబయాలజీ రంగంలో ఒక చారిత్రాత్మక విజయమని భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ ప్రశంసించారు. ఎంఆర్‌ఐ, హిస్టాలజీ వంటి బహుళ ఫ్రేమ్‌వర్క్‌లను ఏకీకృతం చేస్తూ ఈ అట్లాస్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ సంస్థల సహకారం, ప్రైవేట్ భాగస్వామ్యం, దాతల తోడ్పాటు కలిసి పనిచేస్తే ఇటువంటి అద్భుతమైన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ఆయన కొనియాడారు. ఈ విజయంతో అంతర్జాతీయ న్యూరోసైన్స్ పరిశోధనలలో భారతదేశం ఒక కీలక స్థానాన్ని దక్కించుకుంది.