వైభవ్‌ను కట్టడి చేయాలంటే భయపెట్టాలి.. ఈ కుర్రాడు వాళ్లిద్దరి కంటే పెద్ద స్టార్ అవుతాడు: డేల్ స్టెయిన్

Vaibhav Suryavanshi will be a bigger star than Sachin and Kohli says Dale Steyn
  • సచిన్, కోహ్లీలను మించిపోయే సత్తా వైభవ్ సూర్యవంశీకి ఉందని స్టెయిన్ జోస్యం
  • అయితే ఆ యువ కెరటాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సూచన
  • షార్ట్ బాల్స్‌తో వైభవ్‌లో భయం సృష్టిస్తే కట్టడి చేయవచ్చన్న డేల్‌ స్టెయిన్
  • కోహ్లీ మానసిక దృఢత్వాన్ని, నిలకడను ప్రత్యేకంగా కొనియాడిన మాజీ పేసర్
భారత క్రికెట్‌లో సరికొత్త సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీపై దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. వైభవ్ తన కెరీర్ ముగించేనాటికి దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలను మించిపోయే స్థాయికి ఎదుగుతాడని జోస్యం చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వైభవ్, ఆ వెంటనే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో SA20 ఐదో సీజన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్టెయిన్, వైభవ్ ప్రతిభను ఆకాశానికెత్తాడు.

"వైభవ్ ఒక స్పెషల్ టాలెంట్. ప్రస్తుతం చాలా మంది అంతర్జాతీయ ఆటగాళ్ల కంటే మెరుగ్గా ఆడుతున్నాడు. అతను భారత క్రికెట్‌కు దొరికిన ఒక అద్భుతం, ఒక నిధి లాంటివాడు" అని స్టెయిన్ పేర్కొన్నాడు. 

అయితే, ఇంతటి ప్రతిభావంతుడిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించాడు. 

"సచిన్, కోహ్లీ లాంటి దిగ్గజాల గురించి మనం ఆలోచిస్తాం. కానీ, ఈ కుర్రాడు వాళ్లిద్దరినీ కలిపితే ఎంతటి స్థాయి ఉంటుందో, అంతకుమించి ఎదుగుతాడు. అందుకే అతడిని ఎలా మేనేజ్ చేస్తున్నారనేది చాలా ముఖ్యం. అతడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే గొప్ప బాధ్యతతోనే గొప్ప ప్రతిఫలం వస్తుంది. ఒకవేళ సరిగ్గా చూసుకోకపోతే, ఏదో ఒక దశలో అతడిని కోల్పోయే ప్రమాదం ఉంది" అని స్టెయిన్ పేర్కొన్నాడు.

ప్రస్తుత క్రికెట్‌లో వైభవ్‌ను అత్యంత ప్రమాదకర బ్యాటర్‌గా మార్చిన అంశాలను కూడా స్టెయిన్ విశ్లేషించాడు. "అతను ఒక అద్భుతమైన బాల్ స్ట్రైకర్. భారత్‌లో మంచి వికెట్లపై ఆడటాన్ని నేను గమనించాను. అక్కడి మైదానాలు కూడా కొంచెం చిన్నవిగా ఉంటాయి. ఈ పరిస్థితులను అతను చక్కగా ఉపయోగించుకున్నాడు" అని తెలిపాడు. అయితే, బౌలర్లు ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్‌లో కొంచెం ‘భయం’ సృష్టించగలిగితే అతడిని కట్టడి చేయవచ్చని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. "రబాడ అతనికి బాగా బౌలింగ్ చేశాడు. వైభవ్‌కు ఇంకా 15 ఏళ్లే. కాబట్టి ఆటలో కొద్దిగా భయాన్ని జోడించాలి. అతనికి షార్ట్ బాల్స్ వేయడం ఒక మంచి ఆప్షన్" అని సూచించాడు.

ఇదే సమయంలో కొత్త తరం ఆటగాళ్లు వస్తున్నా తన స్థానాన్ని పదిలంగా నిలబెట్టుకుంటున్న 37 ఏళ్ల విరాట్ కోహ్లీని కూడా స్టెయిన్ ప్రశంసించాడు. "కోహ్లీ మానసిక దృఢత్వం, ఆటలో నిలకడగా రాణించాలనే తపన అద్భుతం. తనలో అపారమైన స్వయం ప్రేరణ ఉంది. నా తరంలోని క్రికెటర్లలో మాకు ఉన్నది కూడా అదే" అని అన్నాడు.

టీ20 క్రికెట్‌లో బౌలర్లు రాణించడంపై మాట్లాడుతూ, ఆఫ్ఘ‌నిస్థాన్ బౌలర్ ఫజల్‌హక్ ఫరూఖీని ఉదాహరణగా చూపాడు. ఎన్నో నైపుణ్యాలు ఉన్నా, ఏ బంతిని ఎప్పుడు, ఎలా వేయాలో తెలిసినప్పుడే బౌలర్ విజయవంతం అవుతాడని, లేకపోతే గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని స్టెయిన్ బౌలర్లకు కీలక సలహా ఇచ్చాడు.
Go Back to Shorts
Vaibhav Suryavanshi
Dale Steyn
Indian Cricket
Sachin Tendulkar
Virat Kohli
IPL 2026

More Telugu News