ఫిఫా వరల్డ్ కప్... భారత్ లో ఎక్కడ, ఎలా చూడాలి? వివరాలు ఇవిగో!

FIFA World Cup 2026 schedule and live telecast in India
  • జూన్ 11 నుంచి ఫిఫా వరల్డ్ కప్ 2026
  • అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్త ఆతిథ్యం
  • భారత్ లో ప్రసార హక్కులుజీ ఎంటర్‌టైన్‌మెంట్ కైవసం
  • డీడీ స్పోర్ట్స్ చానళ్లలో కొన్ని కీలక మ్యాచ్ ల ఉచిత ప్రసారం
 ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 గురువారం ప్రారంభం కానుంది. భారత అభిమానులు ఈ టోర్నమెంట్ ప్రసారాలను జీ ఎంటర్‌టైన్‌మెంట్ కు చెందిన చానళ్లలో, జీ5 ఓటీటీలో వీక్షించవచ్చు. అదే సమయంలో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం దూరదర్శన్ స్పోర్ట్స్ (డీడీ స్పోర్ట్స్) ఛానెల్‌లో కొన్ని కీలక మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయనున్నారు.

మొత్తం 104 మ్యాచ్‌లు జీ కొత్తగా ప్రారంభించిన యునైట్8 స్పోర్ట్స్ 1, యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, యునైట్8 స్పోర్ట్స్ 2, యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్‌డీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కామెంటరీ అందుబాటులో ఉంటుంది. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా జీ సంస్థే సొంతం చేసుకుంది. జీ5 (ZEE5) ప్లాట్‌ఫామ్‌లో టోర్నీ మొత్తం లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.799 (మూడు నెలలు), రూ.1,699 (వార్షిక) సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌లను ప్రకటించింది.

మరోవైపు, కేబుల్ లేదా జీ5 సబ్‌స్క్రిప్షన్ లేని అభిమానులకు డీడీ స్పోర్ట్స్ శుభవార్త అందించింది. ప్రభుత్వ తప్పనిసరి షేరింగ్ నిబంధనల మేరకు డీడీ ఫ్రీ డిష్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్‌లపై కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయనుంది. వీటిలో నేటి అర్ధరాత్రి 12:30 గంటలకు భారత్‌లో ప్రసారమయ్యే ఆరంభ మ్యాచ్ (మెక్సికో vs సౌత్ ఆఫ్రికా), అన్ని క్వార్టర్-ఫైనల్స్ (జూలై 9-11), సెమీ-ఫైనల్స్ (జూలై 14-15), ఫైనల్ (జూలై 19) ఉన్నాయి.

అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్ గురువారం ప్రారంభమై జూలై 19న ముగుస్తుంది. ఈసారి 48 జట్లతో విస్తరించిన ఫార్మాట్‌లో ఈ పోటీలు జరుగుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో పాటు, స్టార్ ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలకు ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చనే అంచనాలు టోర్నీపై ఆసక్తిని పెంచుతున్నాయి.
Go Back to Shorts
FIFA World Cup 2026
DD Sports
Zee5
Unite8 Sports
Football streaming India
FIFA 2026 schedule

More Telugu News