నిజం కాబోతున్న ‘రోబో’ సినిమా.. మనుషులపైనే తిరగబడనున్న ఏఐ!
- మనుషుల నియంత్రణను ఏఐ దాటొచ్చన్న ఆంథ్రోపిక్
- తమను తామే అభివృద్ధి చేసుకుంటున్న ఏఐ
- క్లాడ్ సొంతంగానే 80 శాతం కోడింగ్ రాసినట్లు వెల్లడి
- ఏఐ అభివృద్ధిని తాత్కాలికంగా ఆపాలని ప్రతిపాదన
క్లాడ్ ఏఐ చాట్‌బాట్‌ను రూపొందించిన ఈ సంస్థ.. భవిష్యత్తులో ఏఐ వ్యవస్థలు తమకు తామే మరింత శక్తిమంతమైన కొత్త రూపాలను సృష్టించుకునే స్థాయికి చేరుకుంటున్నాయని తెలిపింది. దీన్నే సాంకేతిక భాషలో ‘రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్’ అని పిలుస్తారు. సినిమాలో చిట్టి రోబో తనలాంటి వందలాది రోబోలను తయారు చేసుకున్నట్లే.. నిజ జీవితంలోనూ ఏఐ మనుషుల ప్రమేయం లేకుండా తన తర్వాతి తరాన్ని సృష్టించుకోగలదని పేర్కొంది.
ప్రస్తుత 2026 మే నెల నాటికే తమ సాఫ్ట్‌వేర్ కోడ్ బేస్‌లో ఏకంగా 80 శాతానికి పైగా కోడింగ్‌ను మనుషులు కాకుండా క్లాడ్ ఏఐ మాత్రమే స్వయంగా రాసిందని సంస్థ వెల్లడించింది. ఈ పరిణామం సైన్స్, వైద్య రంగాలకు ఎంతో మేలు చేసినప్పటికీ.. నియంత్రణ కోల్పోతే ఊహించని ముప్పు తెస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వేగవంతమైన మార్పుల నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని ప్రముఖ టెక్నాలజీ సంస్థలు కలిసి ఏఐ అభివృద్ధిని కొన్నాళ్ల పాటు ‘తాత్కాలికంగా నిలిపివేయాలని’ ఆంథ్రోపిక్ ప్రతిపాదించింది.
టెక్నాలజీ కంటే సమాజం, భద్రతా పరిశోధనలు వెనుకబడిపోకుండా ఉండటానికే ఈ విరామం అవసరమని ఆంథ్రోపిక్ స్పష్టం చేసింది. అయితే తీవ్రమైన పోటీ ఉన్న ఈ తరుణంలో అన్ని సంస్థలను ఒప్పించి ఏఐ పరిశోధనలను ఆపడం ప్రాక్టికల్‌గా చాలా కష్టమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు మాత్రం ఈ భయాలను కొట్టిపారేస్తున్నారు. సినిమాలో చూపించినట్లు మనుషుల ఉనికికే ముప్పు వస్తే గనుక మనుషులు ఎప్పుడైనా ఏఐ ప్లగ్‌ను లాగేసి దాన్ని ఆపొచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు.