వైఎస్ చనిపోయి 17 ఏళ్లు అయ్యాక కూడా ఆరోపణలా?: పవన్ కల్యాణ్ కు కేవీపీ రామచంద్రరావు లేఖ
- రాజశేఖరరెడ్డిపై విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్
- పవన్ వ్యాఖ్యలను ఖండించిన కేవీపీ రామచంద్రరావు
- వైసీపీకి, వైఎస్సార్ కు సంబంధం లేదని వ్యాఖ్య
- పాత కక్షలు మర్చిపోవాలని హితవు
దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే భయపడేవారంటూ పవన్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, వైఎస్సార్ ఆత్మబంధువు డాక్టర్ కేవీపీ రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఒక ఘాటు బహిరంగ లేఖను సంధించారు.
"కాంగ్రెస్ అనగానే మీకు వైఎస్సార్ గుర్తుకు వచ్చినందుకు ధన్యవాదాలు" అంటూనే... వైఎస్సార్‌పై పవన్ చేసిన ఆరోపణలను కేవీపీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ముఖ్యమైన రాజకీయ అంశాన్ని స్పష్టం చేశారు. వైఎస్సార్‌కు, ప్రస్తుత వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని కేవీపీ తేల్చి చెప్పారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ పై ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదని కేవీపీ గుర్తు చేశారు. నాడు వైఎస్సార్ కేసులు పెట్టమన్నారంటూ ఓ పోలీస్ అధికారికి తనకు చెప్పినట్టు పవన్ అంటున్నారని, ఆ పోలీస్ అధికారికి తక్షణమే లై డిటెక్టర్ పరీక్ష చేయించాలని కేవీపీ డిమాండ్ చేశారు. "ఒకవేళ ఆ అధికారి చెప్పింది నిజమని తేలితే... నేను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 కోట్లు విరాళంగా ఇస్తాను" అంటూ కేవీపీ ఒక బహిరంగ సవాల్ విసిరారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి 17 ఏళ్లు దాటిన తర్వాత కూడా.. ఇంకా ఆయనపై ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అవివేకమని మండిపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా బలంగా ఉందనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను, విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రయోజనాలను సాధించడం కోసం.. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర ప్రభుత్వంపై పవన్ ఒత్తిడి తీసుకురావాలని హితవు పలికారు. పాత కక్షలను తవ్వుకుంటూ కూర్చోకుండా, డిప్యూటీ సీఎంగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని లేఖలో పేర్కొన్నారు.