గ్రీన్ కార్డ్ నిబంధనలపై అమెరికా యూటర్న్.. భారత టెకీలకు స్వ‌ల్ప‌ ఊరట

H1B Visa US Reverses Green Card Rule Causing Relief to Indian Techies
  • హెచ్-1బీ వీసాదారులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం స్వల్ప ఊరట
  • గ్రీన్ కార్డ్ కోసం దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేవారికి మినహాయింపు ఉంటుందని వెల్లడి
  • గతంలో ట్రంప్ స‌ర్కార్‌ తెచ్చిన కఠిన నిబంధనలతో మొదలైన ఆందోళన
  • తాజా ప్రకటనతో భారత టెక్ ఉద్యోగులలో తగ్గిన ఆందోళన
అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ఇమ్మిగ్రేషన్ విభాగం కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా దేశం విడిచి వెళ్లాల్సిందేనన్న కఠిన నిబంధనపై తాజాగా స్పష్టతనిచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే లేదా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసే ఉద్యోగులు అమెరికాలో ఉంటూనే తమ గ్రీన్ కార్డ్ ప్రక్రియను కొనసాగించవచ్చని తెలిపింది.

గతంలో ట్రంప్ ప్ర‌భుత్వం "అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్" ప్రక్రియపై కఠినమైన నిబంధనలతో ఒక పాలసీ మెమో జారీ చేసింది. దీని ప్రకారం తాత్కాలిక వీసాలపై ఉన్నవారు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తమ స్వదేశాలకు తిరిగి వెళ్లాలని సూచించింది. దీంతో అమెరికాలోని టెక్ రంగంలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏళ్ల తరబడి అక్కడే కెరీర్లు నిర్మించుకుని, కుటుంబాలతో స్థిరపడిన వారు ఈ నిబంధనతో గందరగోళానికి గురయ్యారు.

ఈ ఆందోళనల నేపథ్యంలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) తాజాగా ఒక వివరణ ఇచ్చింది. న్యూస్‌వీక్ కథనం ప్రకారం యూఎస్‌సీఐఎస్ ప్రతినిధి జాక్ కహ్లర్ మాట్లాడుతూ.. "దేశానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే లేదా జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన పనులు చేసే వారు తమ ప్రస్తుత మార్గంలోనే కొనసాగవచ్చు" అని తెలిపారు. అయితే, కొందరిని వారి వ్యక్తిగత పరిస్థితులను బట్టి విదేశాల నుంచి దరఖాస్తు చేసుకోమని అడగవచ్చని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు ఇదే అధికారి "అసాధారణ పరిస్థితుల్లో తప్ప, గ్రీన్ కార్డ్ కోరుకునే విదేశీయులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సిందే" అని ప్రకటించడం గమనార్హం. తాజా వివరణ కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, "ఆర్థిక ప్రయోజనం", "జాతీయ ప్రయోజనం" అనే కేటగిరీల కింద ఎవరు వస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన పూర్తిగా తొలగిపోలేదు.

ప్రస్తుతం అమెరికా టెక్ రంగంలో మెటా, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో హెచ్-1బీ వర్కర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ తరుణంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలపై గందరగోళం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తాజా క్లారిటీ కొంత ఊరటనిచ్చినా పూర్తి భరోసా కోసం స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా గణాంకాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన మొత్తం హెచ్-1బీ వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులే పొందారు. దీన్నిబట్టి ఈ విధానం భారత నిపుణులపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.
Go Back to Shorts
Green Card
H-1B Visa
Indian IT Professionals
USCIS
Immigration
USA
America
Trump Policy
Tech Workers
Employment

More Telugu News