టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. తనను కలవలేకపోయానని ఓ యువతి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో చూసి చలించిపోయాడు. ఆమెకు క్షమాపణ చెబుతూ ప్రత్యేకంగా ఓ వీడియో సందేశాన్ని పంపించాడు. వచ్చేసారి కోల్‌కతా వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానని హామీ ఇచ్చి ఆమెను ఆనందంలో ముంచెత్తాడు.

అస‌లేం జ‌రిగిందంటే..! 
ఇటీవల కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబయి ఇండియన్స్, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం వచ్చిన రోహిత్‌ను చూసేందుకు జినియా అనే యువతి స్టేడియానికి వచ్చింది. తన అభిమాన క్రికెటర్‌ను కలవడం తన కల అని, గంటల తరబడి ఎదురుచూసింది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఆటగాళ్లు బయటకు వస్తున్నప్పుడు, రోహిత్‌ను చూసి 'రోహిత్ భాయ్' అంటూ గట్టిగా అరిచింది. అయితే, అక్కడి అభిమానుల శబ్దంలో ఆమె పిలుపును రోహిత్ గమనించకుండా వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆ యువతి కన్నీరు పెట్టుకుంది. ఈ దృశ్యాన్ని ఆమె బంధువు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్తా వైరల్ అయింది.

ఈ వీడియో రోహిత్ శర్మ దృష్టికి చేరింది. అభిమాని బాధను చూసి హిట్ మ్యాన్ స్పందించాడు. "హాయ్ జినియా! నిన్ను ఈడెన్ గార్డెన్స్‌లో కలవలేకపోయినందుకు క్షమించు. నీ వీడియో చూశాక నాకూ బాధేసింది. కొన్నిసార్లు అభిమానుల రద్దీలో ఎవరు పిలుస్తున్నారో గుర్తించడం కష్టమవుతుంది. వచ్చేసారి కోల్‌కతా వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా కలుస్తాను" అని చెబుతూ ఓ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో చూసిన జినియా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.