టాప్ ప్లేసుపై కన్నేసిన ఎస్ఆర్‌హెచ్‌.. ఎలా సాధ్యమంటే?

Sunrisers Hyderabad Eye Top Spot in Final League Match Against RCB
  • ఆర్సీబీ, జీటీ, ఎస్‌ఆర్‌హెచ్‌లకు ప్లేఆఫ్స్ ఖరారు
  • మొదటి మూడు స్థానాలు ఆ జట్లకే సొంతం
  • నేడు హైదరాబాద్‌లో బెంగళూరు, సన్‌రైజర్స్ ఢీ
  • టాప్-2 చేరాలంటే హైదరాబాద్‌కు భారీ విజయం అవసరం
  • నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం మూడు జట్ల పోటీ
ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరడంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు ఉత్కంఠ రేపుతున్నాయి. గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో గుజరాత్ 18 పాయింట్లతో పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని పక్కా చేసుకుంది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న బెంగళూరు (18 పాయింట్లు), గుజరాత్ (18 పాయింట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (16 పాయింట్లు) జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధించాయి. మిగిలిన ఏ జట్లు కూడా ఈ పాయింట్లను దాటలేవు. కాబట్టి ఈ మూడు జట్లు మొదటి మూడు స్థానాలను పంచుకోవడం ఖాయమైంది. అయితే ప్లేఆఫ్స్‌లో మొదటి రెండు స్థానాల కోసం ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇక ఖాళీగా ఉన్న చివరిదైన నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం రాజస్థాన్, పంజాబ్, కోల్‌కతా జట్లు తలపడుతున్నాయి.

టాప్-2 కోసం సన్‌రైజర్స్ ఏం చేయాలి?
ఐపీఎల్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు (క్వాలిఫయర్-1, ఎలిమినేటర్) దక్కుతాయి. గురువారం నాటి గెలుపుతో గుజరాత్ ఒక స్థానాన్ని దక్కించుకోగా.. మిగిలిన ఒక స్థానం కోసం ఈరోజు హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్, బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టాప్-2లోకి వెళ్లాలంటే ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 87 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకోవాలి. అప్పుడు రన్‌రేట్ పరంగా ఎస్‌ఆర్‌హెచ్ ముందంజ వేస్తుంది. లేదంటే మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

నాలుగో స్థానం కోసం రాజస్థాన్‌ లెక్కలు
ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆదివారం రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే నేరుగా 16 పాయింట్లతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడిపోతే మాత్రం ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాలి. లక్నో చేతిలో పంజాబ్ ఓడిపోవాలి. అలాగే ఢిల్లీ చేతిలో కోల్‌కతా పరాజయం పాలవ్వాలి. ఈ రెండు జరిగితేనే రాజస్థాన్ 14 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంటుంది.

పంజాబ్, కోల్‌కతా దారిదీ
నెట్ రన్‌రేట్‌తో సంబంధం లేకుండా పంజాబ్ ప్లేఆఫ్స్ వెళ్లాలంటే మూడు ఫలితాలు అనుకూలంగా రావాలి. లక్నోపై పంజాబ్ గెలవాలి. ముంబై చేతిలో రాజస్థాన్ ఓడిపోవాలి. కోల్‌కతాపై ఢిల్లీ గెలవాలి. ఒకవేళ కోల్‌కతా ప్లేఆఫ్స్ వెళ్లాలంటే.. లక్నో చేతిలో పంజాబ్ ఓడాలి. ముంబై చేతిలో రాజస్థాన్ పరాజయం చెందాలి. చివరి మ్యాచ్‌లో ఢిల్లీపై కోల్‌కతా భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

రన్‌రేట్ సమరం
పంజాబ్, కోల్‌కతా రెండు జట్లు గెలిచి 15 పాయింట్లతో సమానంగా నిలిస్తే.. రన్‌రేట్ పరంగా పంజాబ్ (+0.277) మెరుగైన స్థానంలో ఉంది. కోల్‌కతా (+0.011) పంజాబ్‌ను దాటాలంటే ఢిల్లీపై 61 పరుగుల తేడాతో గెలవాలి లేదా 13.5 ఓవర్లలోనే ఛేజ్ చేయాలి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ రన్‌రేట్ (-0.871) చాలా ఘోరంగా ఉండటంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యం. గురువారం నాటి ఓటమితో చెన్నై కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Go Back to Shorts
Sunrisers Hyderabad
SRH
Royal Challengers Bangalore
RCB
IPL 2026
IPL Playoffs
Gujarat Titans
Rajasthan Royals
Kolkata Knight Riders
Punjab Kings

More Telugu News