షాపింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. బరువులు మోసేందుకు సరికొత్త సర్వీస్!

Carrymen Offers Shopping Bag Carrying Service in Delhi
  • ఢిల్లీలో ప్రారంభమైన ‘క్యారీమెన్’ స్టార్టప్
  • గంటకు రూ.149 చొప్పున హెల్పర్లు లభ్యం
  • కస్టమర్ల బ్యాగులు మోస్తూ మార్కెట్లో సాయం
  • ఒక హెల్పర్ గరిష్టంగా 12 కిలోల బరువు
  • ఫోల్డింగ్ చైర్లు, గొడుగుల సదుపాయం
ఇప్పటి వరకు బైక్ కావాలంటే ర్యాపిడో, కార్ కావాలంటే ఓలా, ఆకలి వేస్తే జొమాటో వంటి ఎన్నో రకాల డెలివరీ యాప్స్ చూశాం. కానీ షాపింగ్ చేస్తూ భారీ బ్యాగులు మోయలేక ఇబ్బంది పడేవారికోసం ఇప్పుడు మార్కెట్లోకి సరికొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ‘మీరు నచ్చింది కొనండి.. మీ బరువులు మేం మోస్తాం’ అంటూ ప్రయాణాన్ని సులువు చేసే ఒక వినూత్న కాన్సెప్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

క్యారీమెన్ ఆసరా
ఢిల్లీకి చెందిన ‘క్యారీమెన్’ అనే స్టార్టప్ సంస్థ ఈ క్రేజీ ఐడియాను తెరపైకి తెచ్చింది. సరోజినీ నగర్, లజపత్ నగర్ వంటి రద్దీ మార్కెట్లలో షాపింగ్ చేసేవారికి సాయంగా ప్రత్యేకంగా శిక్షణ పొందిన అసిస్టెంట్లను ఈ సంస్థ అందిస్తోంది. గంటకు రూ.149, అరగంటకు రూ.79 చొప్పున చెల్లించి రెండు నుంచి నాలుగు గంటల ప్యాకేజీల కింద వీరిని బుక్ చేసుకోవచ్చు. వీరు కస్టమర్ల వెంటే ఉంటూ షాపింగ్ బ్యాగులను మోస్తారు.

ఫోల్డింగ్ చైర్ సదుపాయం
ఈ సర్వీస్ ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లల తల్లులు, వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఒక అసిస్టెంట్ గరిష్ఠంగా 12 కిలోల బరువు వరకు మోస్తారు. షాపింగ్ చేస్తూ అలసిపోతే కూర్చోవడానికి వీరు ఫోల్డింగ్ ఛైర్లను కూడా వెంట తెస్తారు. అంతేకాదు ఎండ, వానల నుంచి రక్షణకు గొడుగులు, మొబైల్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు, తాగడానికి నీళ్లను కూడా ఈ అసిస్టెంట్లు అందిస్తారు. అదనపు ఛార్జీతో చిన్న పిల్లల కోసం స్ట్రాలర్లను కూడా అద్దెకు ఇస్తున్నారు.

పేలుతున్న జోకులు
ఈ సరికొత్త కాన్సెప్ట్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ ఐడియాను మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘మా షాపింగ్ బ్యాగుల బరువు సరే.. మాకున్న ఎమోషనల్ బరువును కూడా వీరు మోస్తారా?’’ అని ఒకరు జోక్ చేయగా.. ‘‘మార్కెట్ రద్దీలో పెళ్లి లెహంగాలు, కాస్ట్‌లీ శారీస్ బ్యాగులతో వీరు పారిపోతే పరిస్థితి ఏంటి?’’ అని ఇంకొందరు భద్రతా పరమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Carrymen
shopping assistant
Delhi shopping
Sarojini Nagar
Lajpat Nagar
shopping bags
delivery service
India shopping
personal shopper
shopping help

More Telugu News