క్యూబాను అమెరికా ఇప్పుడు ఓ భద్రతాపరమైన ముప్పుగా పరిగణిస్తోంది. సుమారు 300కు పైగా సైనిక డ్రోన్లను హవానా సమీకరించుకుందని, అమెరికా లక్ష్యాలపై దాడులకు సంబంధించిన ప్రణాళికలు చర్చిస్తోందని వర్గీకృత నిఘా వర్గాలు గుర్తించినట్లు ‘యాక్సియోస్’ కథనం వెల్లడించింది. దీంతో ట్రంప్ యంత్రాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉద్రిక్తతలు పెరిగితే గ్వాంటనామో బేలోని అమెరికా నావికా స్థావరం, సైనిక నౌకలు, ఫ్లోరిడాలోని కీ వెస్ట్‌పై దాడులకు క్యూబా అధికారులు ప్రణాళికలు రచించినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. క్యూబాకు రష్యా, ఇరాన్‌లతో పెరుగుతున్న రక్షణ సంబంధాలు, హవానాలో ఇరాన్ సైనిక సలహాదారుల ఉనికిపై అమెరికా ఆందోళన చెందుతోంది. "ఇంత సమీపంలో ఇలాంటి టెక్నాలజీలు ఉండటం ఆందోళన కలిగించే అంశం, ఇదొక పెరుగుతున్న ముప్పు" అని ఒక సీనియర్ అమెరికా అధికారి వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ గురువారం క్యూబాలో పర్యటించి, ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అలాగే, 1996లో రెండు విమానాలను కూల్చివేసిన ఘటనలో క్యూబా మాజీ నేత రౌల్ క్యాస్ట్రోపై అభియోగాలు నమోదు చేసేందుకు అమెరికా న్యాయశాఖ సిద్ధమవుతోంది.

అయితే, ఈ ఆరోపణలను క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ ఖండించారు. ఆంక్షలు, సైనిక జోక్యాన్ని సమర్థించుకునేందుకే అమెరికా తప్పుడు కేసు బనాయిస్తోందని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం ఆత్మరక్షణ హక్కు తమకుందని స్పష్టం చేశారు. అయితే, డ్రోన్లు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని క్యూబా నేరుగా ఖండించలేదు. ఉక్రెయిన్‌లో రష్యా తరఫున పోరాడిన క్యూబన్ సైనికులు డ్రోన్ యుద్ధ తంత్రాలపై అవగాహన పెంచుకున్నారని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ, ఇది 1962 నాటి క్షిపణి సంక్షోభం లాంటి తక్షణ ముప్పు కాదని, కానీ తమ దేశానికి అత్యంత సమీపంలో ఉండటం మాత్రం తీవ్రమైన విషయమేనని అధికారులు స్పష్టం చేశారు.