విదేశాల్లో ఉన్న విషయాన్ని మర్చిపోయా.. సొంత దేశంలో ఉత్సవానికి హాజరైనట్టుగా ఉంది: మోదీ

  • నెదర్లాండ్స్ లోని ది హేగ్ లో ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మోదీ
  • ఆర్థిక, సాంకేతిక రంగాలలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్య
  • సెమీకండక్టర్ల తయారీ రంగంలో వేగంగా ముందడుగు వేస్తున్నామన్న ప్రధాని

భారతదేశం ప్రస్తుతం ఆర్థిక, సాంకేతిక రంగాలలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ అన్నారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా 'ది హేగ్' నగరంలో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశం సాధిస్తున్న డిజిటల్ ప్రగతిని, ప్రవాస భారతీయుల సేవలను ఆయన కొనియాడారు.


ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల రంగంలో భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని ప్రధాని గర్వంగా ప్రకటించారు. దేశంలో ఇప్పుడు నెలకు ఏకంగా 20 బిలియన్ డాలర్ల మేర డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని వెల్లడించారు. సాంకేతిక రంగంలో మన దేశం ఎంతో ప్రగతి సాధించిందని చెప్పారు. ఒకప్పుడు భారత్‌లో కేవలం 4 యూనికార్న్ స్టార్టప్ సంస్థలు మాత్రమే ఉండేవని, కానీ నేడు వాటి సంఖ్య 100కు చేరిందని గుర్తుచేశారు. భవిష్యత్తు సాంకేతికతకు అత్యంత కీలకమైన సెమీకండక్టర్ల తయారీ రంగంలోనూ భారత్ వేగంగా ముందడుగు వేస్తోందని, దానికి సంబంధించిన పనులు క్షేత్రస్థాయిలో చురుగ్గా సాగుతున్నాయని పేర్కొన్నారు.


నెదర్లాండ్స్‌లో ఉన్న భారతీయుల ప్రేమ, ఉత్సాహాన్ని చూస్తుంటే తాను విదేశంలో ఉన్నాననే సంగతి మర్చిపోయానని, సొంత దేశంలో ఏదో ఉత్సవానికి హాజరైనట్లు అనిపిస్తోందని ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. నెదర్లాండ్స్ నాయకత్వం ఎప్పుడు కలిసినా అక్కడి భారతీయ సమాజం చూపిస్తున్న ప్రతిభను, క్రమశిక్షణను ప్రశంసిస్తూనే ఉంటుందని చెప్పారు. తరాలు మారి, దేశాలు మారినా భారతీయులు తమ కుటుంబ విలువలను, సాంప్రదాయాలను ఎప్పటికీ వదులుకోలేదని కొనియాడారు. ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ, భారతదేశ విభిన్న సంస్కృతి ఇప్పటికీ ప్రవాసుల హృదయాల్లో బలంగా సజీవంగా ఉందనడానికి ఈ సభే నిదర్శనమన్నారు.


సరిగ్గా 12 ఏళ్ల క్రితం, 2014 మే 16న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడి దేశంలో దశాబ్దాల తర్వాత ఒక సంపూర్ణ మెజారిటీ కలిగిన స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని ప్రధాని గుర్తుచేశారు. అప్పటి నుంచి కోట్లాది మంది భారతీయులు తనపై ఉంచిన నమ్మకమే దేశాభివృద్ధి కోసం తనను ఆగనివ్వకుండా, అలసిపోనివ్వకుండా ముందుకు నడిపిస్తోందని మోదీ ఎమోషనల్ అయ్యారు.


Narendra Modi
Indian diaspora
Netherlands
Digital payments India
Indian economy
The Hague
India technology
Semiconductor manufacturing
Indian culture
Digital transactions

More Telugu News