సైఫ్ అలీ ఖాన్ కథానాయకుడిగా నటించిన సినిమానే 'కర్తవ్య'. గౌరీఖాన్ నిర్మించిన ఈ సినిమాకి 'పుల్కిత్' దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాను నేరుగా ఈ నెల 15వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. హిందీతో పాటు ఇతర భాషలలోను ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ లో సాగే కథ ఇది. 

పవన్ (సైఫ్ అలీ ఖాన్) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నిజాయితీ .. క్రమశిక్షణకు నిదర్శనంలా ఆయన కనిపిస్తుంటాడు. తండ్రి హరిహర్ .. తమ్ముడు దిలీప్ .. భార్య వర్ష (రసిక  దుగల్) కొడుకు హనీ .. ఇదే అతని కుటుంబం. పవన్ ఫ్యామిలీ నివసిస్తున్న ఆ గ్రామంలో కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. పరువు హత్యలు ఆ గ్రామంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలో పవన్ తమ్ముడు దిలీప్, ప్రీతి అనే ఒక యువతిని తీసుకుని పారిపోతాడు. 

ఆనంద్ శ్రీ అనే ఒక స్వామిజీపై అనేక వివాదాలు ఉంటాయి. చాలామంది టీనేజ్ అమ్మాయిలు  కనిపించకుండా పోవడం వెనుక ఆయన హస్తం ఉందనేది చాలామంది అభిప్రాయం.  స్వామిజీ ముసుగులో అతను చేస్తున్న అరాచకాలను గురించి రాసిన జర్నలిస్ట్ 'రీమా'ను కొంతమంది ఆగంతకులు షూట్ చేసి పారిపోతారు. పవన్ కళ్లముందే ఆమె చనిపోతుంది. 'రీమా'ను షూట్ చేసింది ఒక మైనర్ అని తెలుసుకుని పవన్ షాక్ అవుతాడు.

'రీమా'ను హత్య చేయించిన ఆనంద్ శ్రీ, మైనర్ కుర్రాడైన 'హర్పాల్' ను చంపడానికి తన ప్రధానమైన అనుచరుడైన 'నిర్మల్'ను పంపిస్తాడు. స్వామిజీ మనిషిగా పోలీస్ ఆఫీసర్ 'కేశవ్' కూడా హర్పాల్ కోసం గాలిస్తూ ఉంటాడు. తమ ఊరు పెద్దల కంటపడకుండా దీపక్ - ప్రీతిలను రహస్యంగా ఒక ఇంట్లో దాచిన పవన్, ఆనంద్ శ్రీ మనుషులకు దొరక్కుండా హర్పాల్ ను సిటీ దాటించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అందుకు సమాధానంగా ఏ నిర్ణయాన్ని తీసుకోవడాన్ని పవన్ తన కర్తవ్యంగా భావిస్తాడు? అనేది కథ. 

జీవితంలో ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలను .. పరీక్షలను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితులలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఒక అయోమయానికి లోనవడం జరుగుతూ ఉంటుంది. తప్పు తన ఇంట్లో జరిగినప్పుడు .. సమాజంలో జరిగినప్పుడు తీసుకునే నిర్ణయాలు భిన్నంగా ఉంటాయి. కానీ తనవారైనా .. పరాయివారైనా తన కర్తవ్యాన్ని నిర్వహించడమే కరెక్ట్ అనుకునే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ ఇది.

ఈ కథలో దర్శకుడు హీరో ముందు రెండు సమస్యలను ఉంచుతాడు. ప్రేమ పెళ్లిళ్లను వ్యతిరేకించే పెద్దల వర్గానికి ఎదురెళ్లడం. స్వామిజీ ముసుగులో ఆశ్రమం మాటున అక్రమ కార్యకలాపాలను నిర్వహించే వ్యక్తిని ఎదుర్కోవడం. ఒకే సమయంలో ఈ రెండు సమస్యలతో హీరో సతమతమైపోవడాన్ని చూపిస్తూ వెళ్లారు. రెండు వైపుల నుంచి సమస్యలను పతాకస్థాయికి తీసుకుని వెళుతూ,  ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేశారు.

దర్శకుడు ఈ కథలోని రెండు సమస్యలను లోతుగా ఆవిష్కరించే ప్రయత్నాలు చేయలేదు. కథ చివరిలో హీరో తన కర్తవ్య నిర్వహణను చేపడతాడు. అయితే అందుకు ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు. గన్ తీసి ఒక్కొక్కరినీ షూట్ చేస్తూ వెళతాడు. అయితే స్వామిజీ ట్రాక్ కి సంబంధించి అసలు తలకాయలు మాత్రం అలాగే ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

మొదటి దగ్గర నుంచి క్లైమాక్స్ కి ముందువరకూ నిదానంగా నడిచిన కథ, ఆ తరువాత హడావిడిగా ముగిసిపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. రొటీన్ కథను రొటీన్ గానే చెప్పడం అసహనాన్ని కలిగిస్తుంది.  ఆరిస్టుల నటన గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమీలేదు. ఆ స్థాయి సన్నివేశాలు కూడా పడలేదు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.   

కథగా చూసుకుంటే ఇది కూడా ఒక పోలీస్ స్టోరీ అంతే. ఇంతకుముందు ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. ఆ కథలకు భిన్నంగా వెళ్లడానికి ఎంతమాత్రం ప్రయత్నించని కంటెంట్ ఇది. చాలా తక్కువమంది ఆర్టిస్టులతో .. సింపుల్ బడ్జెట్ లోనే కానిచ్చేశారు. ఎమోషనన్స్ పరంగా .. యాక్షన్ పరంగా ఎక్కడా కనెక్ట్ కాని కథగానే ఇది మిగిలిపోతుంది.