గుజరాత్‌లోని మోర్బీలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంటి అద్దె చెల్లించలేని ఓ వ్యక్తి, దానికి బదులుగా తన భార్య, మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఇంటి యజమానికి అనుమతిచ్చాడు. ఈ అమానుష ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌కు చెందిన ఓ కుటుంబం ఆరు నెలల క్రితం ఉపాధి కోసం మోర్బీకి వలస వచ్చింది. అక్కడ నెలకు రూ.2,000 అద్దెకు ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేకపోయారు.

అద్దె బకాయిలు పేరుకుపోవడంతో కట్టుకున్న భర్తే ఓ కిరాతకమైన ఒప్పందం కుదుర్చుకున్నాడు. బకాయిల కింద తన భార్య, కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడేందుకు ఇంటి యజమానిని అనుమతించాడు. ఈ దారుణం గురించి బాధితురాలి తల్లికి తెలియడంతో ఆమె మోర్బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో సహా కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగి బాధితురాలి భర్తను, ఇంటి యజమానిని అరెస్ట్ చేశారు. "మైనర్ బాలిక తండ్రి, ఇంటి యజమాని ఇద్దరూ కలిసి ఈ అఘాయిత్యానికి పథకం రచించారు" అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేఎం లాల్ తెలిపారు. ఈ నేరంలో ప్రమేయమున్న మూడో వ్యక్తి కోసం కూడా గాలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.