సౌదీలో ఘనంగా టీడీపీ మహానాడు.. తరలివచ్చిన ప్రవాసాంధ్రులు

  • హాజరైన ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మహాసేన రాజేశ్
  • 1700 కిలోమీటర్ల దూరం నుంచి తరలివచ్చిన అభిమానులు
  • విజయవాడకు నేరుగా విమానాల కోసం మహానాడులో తీర్మానం
  • గాయకులు రఘు కుంచె, మాలవిక సంగీత విభావరి
సౌదీ అరేబియాలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మహానాడు అట్టహాసంగా జరిగింది. శుక్రవారం దమ్మాం నగరంలో ఎన్నారై టీడీపీ సౌదీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి కూడా పార్టీ అభిమానులు, ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ సభ, పార్టీ కార్యక్రమం కంటే ఎక్కువగా తెలుగు కుటుంబాల ఆత్మీయ కలయికగా నిలిచింది.

    
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ నుంచి పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ నేత మహాసేన రాజేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ బయట ప్రపంచం అనుకుంటున్న దానికి భిన్నంగా సౌదీ అరేబియా ఎంతో అభివృద్ధి చెందిందని, ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉందని అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డి, పార్టీ నేత సుఖవాసి తదితరులు వీడియో కాల్ ద్వారా ప్రసంగించి, సౌదీ టీడీపీ బృందానికి అభినందనలు తెలిపారు.

    
పార్టీపై అభిమానంతో వందల కిలోమీటర్లు ప్రయాణించి ఈ సభకు హాజరుకావడం విశేషం. ముఖ్యంగా పార్టీకి కంచుకోటగా భావించే రియాద్ నగరం నుంచి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని దమ్మాంకు మహిళలు, పిల్లలతో సహా ప్రత్యేక బస్సుల్లో తరలివచ్చారు. అదేవిధంగా, జెడ్డా నుంచి 1200 కిలోమీటర్లు, జోర్డాన్ సరిహద్దులోని తబూక్ నుంచి ఏకంగా 1700 కిలోమీటర్లు ప్రయాణించి అభిమానులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. పారిశ్రామిక నగరం జుబైల్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.

   
ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రఘు కుంచె, మాళవిక తమ పాటలతో సభికులను ఉర్రూతలూగించారు. రియాద్ టీడీపీ బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జానీ బాషా, రాజశేఖర్, ఖాలీద్ సైఫుల్లా, కోగంటి శ్రీనివాసరావు తదితర నిర్వాహక బృందం, నిద్రాహారాలు మాని కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించింది. వచ్చిన అతిథులకు, కార్యకర్తలకు అతిథ్య రెస్టారెంట్ సంప్రదాయ తెలుగు భోజనాన్ని అందించింది.

ఈ మహానాడులో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించేలా ఎయిర్‌లైన్స్ సంస్థలను ఒప్పించేందుకు ప్రతి ప్రవాసాంధ్రుడు కృషి చేయాలని టీడీపీ సౌదీ శాఖ అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా చేసిన సూచనను ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే, గల్ఫ్ వెళ్లే వారికి వీసా, మెడికల్ పరీక్షల కోసం 'గమ్కా' కేంద్రాలను విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో ఏర్పాటు చేయాలని, గల్ఫ్‌లో మరణించిన ప్రవాసుల పిల్లలకు ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం, గృహ వసతి కల్పించాలని కోరుతూ చేసిన తీర్మానాలకు కూడా సభ ఆమోదం తెలిపింది.

TDP Mahanadu
Saudi Arabia
Telugu Desam Party
NRI TDP
Bode Prasad
Ravi Radhakrishna
Andhra Pradesh
Gulf NRIs
Raghu Kunche
Vijayawada Airport

More Telugu News