ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో ఆకాశ్ సింగ్ (3/26) అదరగొట్టగా, బ్యాటింగ్‌లో మిచెల్ మార్ష్ (38 బంతుల్లో 90) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 188 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో మరో 20 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆకాశ్ సింగ్ తన అద్భుత బౌలింగ్‌తో గైక్వాడ్, శాంసన్, ఉర్విల్ పటేల్‌లను పెవిలియన్‌కు పంపి చెన్నై టాప్ ఆర్డర్‌ను కూల్చాడు. కష్టాల్లో పడిన జట్టును కార్తీక్ శర్మ (42 బంతుల్లో 71), డెవాల్డ్ బ్రెవిస్ (25) ఆదుకున్నారు. చివర్లో శివమ్ దూబే (16 బంతుల్లో 32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

భారీ లక్ష్య ఛేదనలో లక్నో ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ (32 బంతుల్లో 36) తొలి వికెట్‌కు 135 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. 9 ఫోర్లు, 7 సిక్సర్లతో చెన్నై బౌలర్లను ఉతికారేశాడు. సెంచరీకి కేవలం 10 పరుగుల దూరంలో దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు.

మార్ష్ నిష్క్రమణ తర్వాత నికోలస్ పూరన్ (17 బంతుల్లో 32) తనదైన శైలిలో హిట్టింగ్ చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. లక్నో సొంతగడ్డపై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.