హంటావైరస్‌కు విరుగుడు సిద్ధం.. కానీ నిధుల కొరతే శాపం!

Hantavirus Scientists Were Close To Vaccine But Ran Out of Money
  • క్రూయిజ్ షిప్‌లో హంటావైరస్ వ్యాప్తితో డ‌బ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
  • మనిషి నుంచి మనిషికి సోకే వైరస్‌
  • నిధుల కొరతతో నిలిచిపోయిన హంటావైరస్‌ చికిత్స పరిశోధన 
  • క్లినికల్ ట్రయల్స్ దశలో ఆగిపోయిన చిలీ శాస్త్రవేత్త డాక్టర్ బరియా బృందం 
  • పరిశోధనలు మళ్లీ మొదలుపెట్టాలంటే 7 మిలియన్ డాలర్ల నిధులు అవసరం
అర్జెంటీనా నుంచి యూరప్ వెళ్తున్న ఓ క్రూయిజ్ షిప్‌లో ప్రాణాంతక హంటావైరస్ కలకలం రేపింది. ఈ ఘటనలో పలువురు మరణించగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామం ఏళ్ల క్రితమే ఈ వైరస్‌కు విరుగుడు కనుగొనే అంచున నిలిచి, నిధుల కొరతతో వెనకడుగు వేసిన ఓ శాస్త్రవేత్త పరిశోధనను మళ్లీ ప్రపంచం ముందు నిలిపింది.

చిలీకి చెందిన ఇమ్యూనోవైరాలజీ శాస్త్రవేత్త డాక్టర్ బరియా, ఆమె బృందం 2016లోనే హంటావైరస్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలను అభివృద్ధి చేయడంలో కీలక పురోగతి సాధించారు. ఈ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరిని బలి తీసుకుంటుంది. బరియా బృందం అభివృద్ధి చేసిన యాంటీబాడీలు ప్రయోగశాలలో వైరస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశాయి. జంతువులపై జరిపిన ప్రయోగాల్లోనూ అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఊపిరితిత్తుల నుంచి ఇన్‌ఫెక్షన్‌ను పూర్తిగా తొలగించగల శక్తి ఈ యాంటీబాడీలకు ఉన్నట్టు తేలింది.

దీంతో, మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేయడానికి వారు సిద్ధమయ్యారు. అయితే, దీనికి సుమారు 7 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 58 కోట్లు) భారీ మొత్తం అవసరమైంది. అంతర్జాతీయ నిధుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టింది. దీంతో శాస్త్రవేత్తల దృష్టి, ప్రభుత్వాల నిధులు అన్నీ కరోనా వైపు మళ్లాయి. ఫలితంగా, హంటావైరస్‌పై జరగాల్సిన కీలక పరిశోధన నిలిచిపోయింది.

ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన హంటావైరస్ 'ఆండీస్' జాతికి చెందింది. ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే ఏకైక హంటావైరస్ కావడంతో దీనిపై ఆందోళన ఎక్కువగా ఉంది. చిలీ, అర్జెంటీనా దేశాల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువ. ఒక్క 2026లోనే చిలీలో 39 కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. "నిధులు, వనరుల కొరతే మా పరిశోధనలకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఇప్పుడు నిధులు సమకూరినా, మేం ఆగిన చోట నుంచి మళ్లీ మొదలుపెట్టడానికి కనీసం 12 నుంచి 24 నెలల సమయం పడుతుంది" అని డాక్టర్ బరియా ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం క్రూయిజ్ షిప్ ఘటనతో ఈ వైరస్‌పై మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే, చేతికి వచ్చినట్టే వచ్చి, అందుబాటులో ఉండాల్సిన చికిత్స కేవలం నిధుల కొరత కారణంగా అందుబాటులోకి రాకపోవడం ఆందోళన కలిగించే విషయం.
Go Back to Shorts
Hantavirus
Andes virus
Doctor Barria
WHO
Cruise ship virus
Viral outbreak
Immunology
Antiviral research
Chile
Argentina

More Telugu News