ఇది జాతీయ టాస్క్... ప్రతి ఒక్కరూ స్వీకరించాలి: సీఐఐ సదస్సులో చంద్రబాబు

Chandrababu Naidu Calls for National Mission at CII Summit
  • ప్రధాని మోదీ ఇచ్చిన 8 సూత్రాల జాతీయ మిషన్‌ను వివరించిన చంద్రబాబు
  • మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థానానికి చేరుతుందని ధీమా
  • ప్రకృతి సేద్యం ద్వారా ఎరువుల దిగుమతి తగ్గించవచ్చని సూచన
  • ఏపీలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నామని వెల్లడి
  • దేశం, రాష్ట్ర ప్రయోజనాలే తన అజెండా అని స్పష్టీకరణ
దేశ స్వయం సమృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల ముందుంచిన 8 అంశాల జాతీయ మిషన్‌ను ప్రతిఒక్కరూ స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో జరిగిన సీఐఐ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని ప్రతిపాదించిన 8 సూత్రాలను కూలంకషంగా వివరించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేయాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. ఇంధనాన్ని పొదుపుగా వాడాలని, అదే సమయంలో ప్రతి ఇల్లు, పరిశ్రమ, పొలం ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని సూచించారు. యుద్ధానంతర పరిస్థితుల వల్ల గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం కీలకమన్నారు. 

దేశంలో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నందున, 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని ప్రోత్సహించాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. వీటన్నింటి ద్వారా 'గ్రేటర్ సెల్ఫ్ రిలయన్స్' (సంపూర్ణ స్వావలంబన) సాధించడం సాధ్యమవుతుందని, ఇందులో భాగంగా ప్రకృతి సేద్యం కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకృతి సేద్యం వల్ల ఎరువుల దిగుమతి తగ్గి దేశం స్వయం సమృద్ధి సాధిస్తుందని అన్నారు. మొతమ్మీద ఇది ఒక జాతీయ టాస్క్ అని, దీన్ని అందరూ కలిసికట్టుగా సాధించాలని ఆయన కోరారు.

మోదీ నాయకత్వంలో భారత్ అగ్రగామి
దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ లభించారని చంద్రబాబు ప్రశంసించారు. సంస్కరణల వాది అయిన మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయని, ఇది అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన పశ్చిమ బెంగాల్, గత కొంతకాలంగా అభివృద్ధి ఆలోచనలే లేకుండా వెనుకబడిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

1990లలో పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎన్నో అవకాశాలు కల్పించాయని, టెలికాం, విద్యుత్, రహదారుల రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. ఆ సంస్కరణల్లో తాను కూడా భాగస్వామిని కావడం సంతోషంగా ఉందన్నారు.

ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్
ప్రధాని ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పలు చర్యలు చేపడుతోందని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో 'ప్రోజ్యూమర్' (ఉత్పత్తిదారు-వినియోగదారు) విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని, సోలార్ రూఫ్‌టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. మైక్రో గ్రిడ్ వ్యవస్థ ద్వారా విద్యుత్ సరఫరా నష్టాలను తగ్గిస్తున్నామన్నారు. 

రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారని, దీని ద్వారా భూసారాన్ని పెంచుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నామని వివరించారు. ప్రతీ సవాలు ఒక అవకాశాన్ని సృష్టిస్తుందని, భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని (అన్‌స్టాపబుల్), త్వరలోనే దేశం ఒక గ్లోబల్ జెయింట్‌గా మారుతుందని చంద్రబాబు అన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలే తన అజెండా అని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
CII Business Summit
Narendra Modi
Indian Economy
Self Reliance
Natural Farming
Sustainable Development
PV Narasimha Rao
Economic Reforms

More Telugu News