'బిల్డ్ ఏపీ' తమ నినాదమన్న సీఎం చంద్రబాబు.. దేశ ప్రగతిలో ఏపీ కీలకమన్న పీయూష్ గోయల్
Add ap7am to your home Screen

'బిల్డ్ ఏపీ' తమ నినాదమన్న సీఎం చంద్రబాబు.. దేశ ప్రగతిలో ఏపీ కీలకమన్న పీయూష్ గోయల్

Build AP is our slogan says CM Chandrababu Naidu as Piyush Goyal calls AP key to Indias progress
  • 'బిల్డ్ ఏపీ' నినాదంతో ముందుకు వెళుతున్నామని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
  • ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న సీఎం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
  • ఒప్పందాలను వాస్తవ పెట్టుబడులుగా మార్చడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి
  • ఏపీ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చిన పీయూష్ గోయల్
  • గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి భారీ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని వెల్లడి
'బిల్డ్ ఏపీ' నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పనలో దేశంలోనే అగ్రగామి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) భాగస్వామ్య సదస్సు-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, భవిష్యత్ కార్యాచరణను పారిశ్రామికవేత్తలకు వివరించారు.

గత 28 నెలల్లో రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించగలిగామని చంద్రబాబు తెలిపారు. కేవలం అవగాహన ఒప్పందాల (ఎంవోయూ)కే పరిమితం కాకుండా, వాటిని వాస్తవ పెట్టుబడులుగా మార్చేందుకు పటిష్ఠమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయని వెల్లడించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఎస్క్రో ఖాతాను నవంబరు 12, 13 తేదీల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. పెట్టుబడులకు అవరోధంగా ఉన్న నాలా చట్టాన్ని రద్దు చేశామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పరిశ్రమలకు అన్ని అనుమతులు వేగంగా అందిస్తున్నామని తెలిపారు.

వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు

నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నీటి కొరత తీర్చవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా, రాష్ట్రాన్ని సౌత్‌ఈస్ట్ ఏషియాకు గేట్‌వేగా మార్చడమే ధ్యేయమన్నారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 110 గిగావాట్లకు ఒప్పందాలు కుదిరాయని, ప్రత్యేక ట్రాన్స్‌మిషన్ కారిడార్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. దుగరాజపట్నం, మచిలీపట్నంలో షిప్ బిల్డింగ్ కేంద్రాలు, తిరుపతి, కొప్పర్తిలలో ఎలక్ట్రానిక్స్, డ్రోన్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పాలనలో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని, అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారం అభినందనీయమని, పోలవరం, అమరావతి నిర్మాణానికి అండగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

భారత ప్రగతిలో ఏపీది కీలక పాత్ర: పీయూష్ గోయల్

ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, భారత అభివృద్ధి ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ది చారిత్రక పాత్ర అని కొనియాడారు. శాతవాహనుల కాలం నుంచే ఆంధ్ర ప్రాంతం నౌకా వాణిజ్యానికి ప్రసిద్ధి అని గుర్తుచేశారు. విజనరీ నేత చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు "టీమ్ ఇండియా"గా కలిసి పనిచేస్తున్నాయని, కేంద్రం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఏపీ భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోందని అన్నారు. ‘ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాస్, ఆత్మరక్ష’ అనే విధానాలతో దేశం ముందుకు సాగుతోందని, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ, అధ్యక్షుడు ముకుంద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Piyush Goyal
Build AP
Andhra Pradesh Investments
CII Partnership Summit 2026

More Telugu News