మా వాటా వెంటనే విడుదల చేయండి.. తెలంగాణకు ఏపీ తెలుగు అకాడమీ డిమాండ్

Andhra Pradesh Telugu And Sanskrit Academy Chairman Wilson Urged Telangana Government To Immediately Release Pending Funds
  • ఏపీ వాటా నిధులు విడుదల చేయాలని తెలంగాణను డిమాండ్ చేసిన తెలుగు అకాడమీ
  • సుప్రీంకోర్టు ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపణ
  • నిధుల కొరతతో అకాడమీ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులున్నాయన్న ఛైర్మన్ విల్సన్
  • ఇంటర్ పుస్తకాల బకాయిలు రూ.50 కోట్లు కూడా రావాల్సి ఉందని వెల్లడి
  • అకాడమీ ఛైర్మన్‌కు కేబినెట్ హోదా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి
రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకాల వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలుగు అకాడమీకి సంబంధించిన నిధుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీకి రావాల్సిన వాటా నిధులను తెలంగాణ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్‌ ఆర్‌డీ విల్సన్‌ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వాటిని బేఖాతరు చేస్తోందని ఆయన ఆరోపించారు.

నిధుల కొరత కారణంగా ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ కార్యకలాపాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని విల్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు, సమగ్ర శిక్షా అధికారులకు లేఖలు రాసినట్లు గుర్తుచేశారు. మరోవైపు ఏపీ ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాల ముద్రణకు సంబంధించి రావాల్సిన రూ.50 కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలుగు అకాడమీ ఆస్తులు, డిపాజిట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య 58:42 నిష్పత్తిలో పంపిణీ చేయాలని గతంలోనే ఒప్పందం కుదిరింది. దీనిపై సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకుని, ఏపీ వాటాను 6 శాతం వడ్డీతో సహా చెల్లించాలని 2021 హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ తెలంగాణ నుంచి స్పందన లేదని ఏపీ అకాడమీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సందర్భంగా విల్సన్ ఏపీ ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. తమిళనాడు తరహాలో ఏపీలో వర్చువల్‌ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, అకాడమీ భవనం కోసం ప్రభుత్వం భూమి కేటాయిస్తే రూ.15 కోట్లతో నిర్మిస్తామని తెలిపారు. తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్‌కు కేబినెట్‌ హోదా కల్పించాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా అకాడమీ పుస్తకాలను కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలని, అకాడమీలో ఖాళీగా ఉన్న 13 పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
AP Telugu And Sanskrit Academy Chairman
Wilson
Telangana Government
Funds

More Telugu News